hyderabadupdates.com movies సినిమాలో లేని పాటకోసం కోటి రూపాయలా…

సినిమాలో లేని పాటకోసం కోటి రూపాయలా…

సినిమాల ప్రమోషన్‌ను కొత్త పుంతలు తొక్కించే క్రమంలో కొంచెం భిన్నంగా ఏదైనా చేయాలని చూస్తుంటాయి చిత్ర బృందాలు. ప్రమోషనల్ సాంగ్స్ చేసి రిలీజ్ చేయడం ఇందులో భాగమే. ఆ పాటలు సినిమాలో కూడా ఉండవు. కేవలం ప్రమోషన్లకే పరిమితం అవుతుంటాయి. ఇలాంటి పాటల్ని సాధ్యమైనంత తక్కువ ఖర్చుతోనే తీయాలని చూస్తారు. 

కానీ ‘ది గర్ల్ ఫ్రెండ్’ అనే చిన్న సినిమా కోసం చేసిన ప్రమోషనల్ సాంగ్ ఏకంగా కోటి రూపాయలు ఖర్చు పెట్టేసిందట టీం. కొన్ని నెలల కిందటే సినిమా నుంచి ‘నదివే’ అంటూ సాగే ఒక ప్రమోషనల్ సాంగ్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పాటకు చాలా ఎక్కువ ఖర్చు పెట్టేశామంటూ నిర్మాత ధీరజ్ మొగిలినేని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. దానికి అంత బడ్జెట్ అవుతుందని ఊహించలేదని.. కానీ కమిటయ్యాం కనుక ఆ పాట చేయాల్సి వచ్చిందని ధీరజ్ తెలిపాడు.

ఈ సినిమా నుంచి తొలి పాట రిలీజ్ చేద్దాం అనుకున్నపుడు.. రొటీన్‌గా ఎందుకు చేయాలని ఆలోచించామన్నాడు ధీరజ్. లిరికల్ వీడియో అంటూ అందరూ ఒకేలా చేస్తారని.. అలా కాకుండా భిన్నంగా ఏదైనా చేద్దాం అని ఆలోచించి ప్రమోషనల్ సాంగ్ చేద్దాం.. దాన్ని షూట్ చేసి రిలీజ్ చేద్దాం అని తనే దర్శకుడు రాహుల్ రవీంద్రన్‌కు ఐడియా ఇచ్చినట్లు ధీరజ్ తెలిపాడు. 

కాన్సెప్ట్ అనుకున్నాక దానికి ఏర్పాట్లు జరిగాయని.. షూట్‌కు రెండు రోజుల ముందు దాని కోసం ప్రొడక్షన్ టీం బడ్జెట్ వేసి చూపించిందని.. అది చూసి తాను షాకయ్యానని ధీరజ్ తెలిపాడు. ఏకంగా కోటి రూపాయలు ఆ పాట కోసం ఖర్చు చేశామని.. తీరా చూస్తే ఆ పాట సినిమాలో ఉండదని.. ప్రమోషన్లకే పరిమితమవుతుందని అతను చెప్పాడు. కానీ చేయాలి అనుకున్నాం కాబట్టి ఆ పాట పూర్తి చేశామని ధీరజ్ తెలిపాడు. రష్మిక, ధీరజ్ శెట్టి జంటగా నటించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

Related Post

Ram Charan inaugurates the first-ever Archery Premier League amidst huge crowd
Ram Charan inaugurates the first-ever Archery Premier League amidst huge crowd

A landmark sporting event unfolded at Ramleela Maidan, New Delhi, as Tollywood star hero Ram Charan inaugurated the first ever Archery Premier League (APL) on the auspicious occasion of Dussehra.