జనం బాట పేరుతో ప్రజల మధ్యకు వచ్చిన జాగృతి అధ్యక్షురాలు, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత.. కరీంనగర్‌లో యాత్ర చేశారు. ఈ సందర్భంగా ఇక్కడి కార్మికులు, చేతి వృత్తుల వారు, ప్రజలు, మహిళలను కలుసుకున్నారు. అనంతరం ఆమె.. మీడియాతో మాట్లాడుతూ.. అనేక విషయాలను ప్రస్తావించారు. ముఖ్యంగా 2023 ఎన్నికలకు ముందు జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆనాడు ఫోన్ ట్యాపింగ్ బాధితుల్లో తమ కుటుంబం కూడా ఉందన్నారు.
“మా ఆయన అనిల్ ఫోన్‌ను కూడా ట్యాప్ చేశారు. సొంత బావ అని కూడా చూడకుండా రాజకీయాలు చేశారు“ అని కవిత ఫైరైయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదై.. విచారణ సాగుతున్న సమయంలో తాను ఎంతో బాధపడినట్టు చెప్పారు. సొంత బావ ఫోన్‌ను కూడా ట్యాప్ చేస్తారన్న విషయం తనకు అప్పటి వరకు తెలియదన్నారు. బీఆర్ ఎస్ పార్టీలో ఉండి.. తాను అనేక అవమానాలు ఎదుర్కొన్నానని చెప్పారు. అన్యాయం జరిగినా భరించానని, కానీ.. ఇలాంటి అవమానాలు తట్టుకోలేనని కవిత వ్యాఖ్యానించారు. ఆత్మ గౌరవాన్ని మించిన ఆస్తి లేదన్న కవిత.. అందుకే పార్టీని వదిలి ప్రజల్లోకి వచ్చానన్నారు.
టచ్‌లో ఉన్నారు..
కాగా.. బీఆర్ ఎస్ నుంచి తాను బయటకు వచ్చిన తర్వాత.. అనూహ్యమైన మద్దతు లభిస్తోందని కవిత చెప్పారు. చాలా మంది సీనియర్ నాయకులుత నకు టచ్‌లో ఉన్నారని.. వారు కూడా పార్టీని విడిచి పెట్టేందుకు రెడీగా ఉన్నారని.. వ్యాఖ్యానించారు. త ను పిలిస్తే వచ్చేందుకు ముఖ్యనాయకులు ఎదురు చూస్తున్నట్టు తెలిపారు. అయితే.. దేనికైనా సమయం సందర్భం ఉంటుంద ని చెప్పారు. తెలంగాణలో రాజకీయ శూన్యత ఉందని.. దీంతో ప్రజల నుంచి తనకు ఆదరణ లభిస్తోందని కవిత చెప్పారు. గతంలో తాను పంజరంలో ఉండేదాన్నని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ, ఇప్పుడు తాను ఫ్రీబర్డ్ అయ్యాయని తెలిపారు.
ఇక నుంచి ప్రజల సమస్యలపైనే దృష్టి పెడతానన్నారు. ప్రజలు కూడా తనను ఆదరిస్తున్నట్టు కవిత తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు తీర్చడంలో కాంగ్రెస్, బీఆర్ ఎస్ పార్టీలు విఫలమయ్యాయన్న కవిత.. ఇప్పుడు ప్రజలంతా తమపైనే ఎక్కువగా ఆశలు పెట్టుకునేందుకు ఇదే కారణమని వ్యాఖ్యానించారు. వచ్చే మూడేళ్లలో రాష్ట్రంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయని చెప్పారు. నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుందని, అదేవిధంగా మహిళా రిజర్వేషన్లు కూడా అమల్లోకి వస్తాయన్నారు. అప్పుడు తమ జాగృతికి మరింత ఆదరణ పెరుగుతుందన్నారు.
‘జాగృతి జనం బాట` పేరుతో ప్రారంభించిన ఈ కార్యక్రమం నిజామాబాద్ నుంచి కరీంనగర్‌లోకి ప్రవేశించింది. సామాజిక తెలంగాణ సాధన కీలక లక్ష్యంగా కవిత చేపట్టిన యాత్ర వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు సాగనుంది. ఆ తర్వాత.. రాజకీయ పార్టీ ఏర్పాటుపై కవిత కీలక ప్రకటన చేయనున్నారు. ప్రస్తుతం సాగుతున్న యాత్రకు.. ప్రజల నుంచి మిశ్రమ స్పందన వస్తుండడం గమనార్హం.