ఒకే రోజు.. ఢిల్లీలో పర్యటనలు. అయితేనేం.. ఇద్దరి దృష్టీ ఏపీపైనే. ఏపీలో పెట్టుబడులపైనే. క్షణం తీరిక లేకుండా పారిశ్రామిక వేత్తలతో భేటీలు.. పెట్టుబడుల కోసం వేటలు.. ఇదీ.. ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమాడు, మంత్రి నారా లోకేష్ మంగళవారం ఢిల్లీలో వ్యవహరించిన తీరు. ఏ చిన్న గ్యాప్ వచ్చినా.. వెంటనే ఏపీలో పరిణామాలపై ఆరా. ఆ వెంటనే చర్యలకు ఆదేశం. తొలిసారి సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేష్ సంయుక్తంగా ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. గతంలో కూడా ఇద్దరు నాయకులు వెళ్లినా.. వేర్వేరుగానే వెళ్లారు. వేర్వేరు కార్యక్రమాలకు హాజరయ్యారు. కానీ, తొలిసారి సీఎం, మంత్రి కలిసి వెళ్లారు.
ముఖ్యమంత్రిగా చంద్రబాబు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగు ప్రాజెక్టులు, నిధులు, పూర్వో దయ పథకంలో చేర్పు వంటి కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. అనంతరం.. సీఐఐ భాగస్వామ్య సదస్సులో దేశంలోని ప్రముఖ పారిశ్రామిక వేత్తలతో సీఎం భేటీ అయ్యారు. వారికి ఏపీ ప్రాధాన్యతలు వివరించారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను తెలిపారు. శాంతి భద్రతలు, సముద్ర తీరం, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాలు.. ఇలా అనేక అంశాలను వారితో పంచుకున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని వారిని ఆహ్వానించారు. ఇలా అనేక రూపాల్లో చంద్రబాబు పెట్టుబడుల కోసం ప్రయత్నించారు.
ఇక, చంద్రబాబు తనయుడిగా.. మంత్రిగా నారా లోకేష్ కూడా ఏపీ ప్రాధాన్యాల కోసమే ఢిల్లీ భాట పట్టారు. పెట్టుబడుల సముపార్జనలో ఆయన కూడా బిజీ అయ్యారు. ‘మేకిన్ ఇండియా’ అమలు విషయంపై చర్చించేందుకు ఢిల్లీలో నిర్వహించిన ‘ఎయిర్‌బస్ బోర్డు’ సమావేశంలో నారా లోకేష్ పాల్గొన్నారు. ఎయిర్‌బస్ ప్రతినిధులను ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆయన ఆహ్వానించారు. అంతేకాదు.. రాష్ట్రం ప్రపంచస్థాయి ఏరో స్పేస్ తయారీ కేంద్రంగా మారుతోందని తెలిపారు.
రాష్ట్రంలో పారిశ్రామిక అవసరాలకు తగినంత భూమి ఉందని, ఉద్యోగాలు, ఉపాధి కల్పించేవారికి తక్కువ ధరలకే భూములు ఇస్తున్నామని పలు ఉదాహరణలతో ఆయన వారికి వివరించారు. పెట్టుబడులు పెట్టేవారికి తక్షణ అనుమతులు ఇచ్చేలా సింగిల్ విండో విధానం అమలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఇలా.. అటు సీఎం చంద్రబాబు, ఇటు నారా లోకేష్ కూడా.. ఒకేసారి ఢిల్లీలో ఏపీ గురించి పలు కార్యక్రమాల్లో పాల్గొనడం సంచలనంగా మారింది.