చుట్టూతా అడవి.. పక్కనే సెలయేరు.. ఒక బండరాయిపై కూర్చున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతిలో పుస్తకం పట్టుకొని సీరియస్ గా చదువుతున్నారు.. సోషల్ మీడియాలో దీనిని చూసిన ఆయన అభిమానులు, జనసైనికులు.. ఆ పుస్తకం పేరు ఏంటని ఆసక్తిగా గమనించారు. మరికొందరైతే ఆ పుస్తకం పైన టైటిల్ ని చూసి గూగుల్ సెర్చ్ చేశారు. కెన్నెత్ ఆండర్సన్ రాసిన మాన్ ఈటర్స్ జంగిల్ కిల్లర్స్ పుస్తకం అది..! ఆ పుస్తకంలో ఏముంది అనే ఆసక్తి సహజంగానే అందరికీ కలిగింది.
1910- 1974 మధ్య కాలంలో జీవించిన కెన్నెత్ ఆండర్సన్ భారతదేశానికి చెందిన స్కాట్లండు సంతతి వాడైన ప్రముఖ రచయిత, వేటగాడు, అధికారి. బెంగళూరులో నివాసముంటూ భారతదేశపు అడవులలో సంచరించే పులులు, చిరుతపులులు, ఏనుగులు అడవి కుక్కలు, పాములు, ఎలుగుబంట్లు మొదలైన వన్యమృగాల గురించి ఆసక్తికరమైన ఎన్నో పుస్తకాలు, రచనలు చేశారు. ఈ పుస్తకంలో మనుషులను చంపే మృగాలను నిర్మూలించాలని పిలుపుని అందుకున్న వేటగాడు ఎలా తన సవాలను స్వీకరిస్తాడు… ఇందులోని వేటగాడి క్యారెక్టర్ ద్వారా అడుగు అడుగుగా తన అనుభవాలను వివరించి, తన వేట విధానాన్ని, అందులో దాగి ఉన్న భయం మరియు ఉత్కంఠను పాఠకుడి ముందు ఉంచాడు ఆండర్సన్.
పవన్ కళ్యాణ్ కు సహజంగా పుస్తకాలు చదవడం అంటే ఎంతో ఆసక్తి. మరి ఇతర రాజకీయ నాయకుడికి లేని అలవాటు ఇది. ఈ ఏడాది విజయవాడలో జరిగిన 35వ పుస్తక మహోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఇటీవల లక్ష్మి ముర్డేశ్వర్ పురి రచించిన “ఆమె సూర్యుడిని కబళించింది” పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. పలు ప్రసంగాల్లో ఆయన పుస్తకాల్లోని వాక్యాలను ప్రస్తావిస్తుంటారు. ఇప్పుడు ఈ పుస్తకాన్ని చదవడంతో సహజంగానే అందరికీ ఆ పుస్తకంపై ఆసక్తి కలిగింది.