అక్షరాలా వంద కోట్లు.. అంటే వెయ్యి మిలియన్లు.. ఈ మొత్తాన్ని ఒకరికి ఇస్తానని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఏపీ నుంచి ఎవరైనా నోబుల్ ప్రైజ్ సాధిస్తే వంద కోట్లు ఇస్తామని గతంలో ప్రకటించాం.. క్వాంటం టెక్నాలజీ ద్వారా దీనిని ఎవరైనా అందిపుచ్చుకుంటే వారికి వందకోట్లు ఇస్తాం అని ఆయన అన్నారు.
క్వాంటమ్ టాక్ బై సీఎం సీబీఎన్ కార్యక్రమం ఈ రోజు జరిగింది. వర్చువల్ గా ఈ కార్యక్రమానికి వైసర్, క్యూబిట్ సంస్థల ప్రతినిధులు, ఐఐటీ చెన్నై, తిరుపతి డైరెక్టర్లు. వేల మంది టెక్ విద్యార్ధులు హాజరయ్యారు. ఇందులో సీఎం ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు.
నోబెల్ బహుమతికి నగదు బహుమతి 11 మిలియన్ స్వీడిష్ క్రోనార్ ఇస్తారు. అంటే సుమారు 1.17 మిలియన్ అమెరికన్ డాలర్లు లేదా రూ. 10.36 కోట్లు ఉంటుంది, ఇది ప్రతి సంవత్సరం మారుతుంది, అటువంటిది ఒక రాష్ట్ర సీఎం ఏకంగా 100 కోట్లు ప్రకటించడం విశేషం.
ఏ అంశంలో అయినా ఏపీ ఫాస్ట్ లెర్నర్ అని సీఎం అన్నారు. ఏ సాంకేతికత అయినా విప్లవమైనా ఏపీ సారధ్యం వహిస్తుంది. ఎవరినీ అనుసరించదని తెలిపారు. క్వాంటం కంప్యూటింగ్ పరికరాలను కూడా వచ్చే రెండేళ్లలో అమరావతి నుంచే ఉత్పత్తి చేసి ప్రపంచానికి అందిస్తాం అన్నారు. వ్యక్తిగత ఔషధాలు, ప్రివెంటివ్, క్యురేటివ్ హెల్త్‌ను క్వాంటం అప్లికేషన్ల ద్వారా అందించే అవకాశం ఉంటుందన్నారు. క్వాంటం రంగంలో లక్ష మంది క్వాంటం నిపుణుల్ని తయారు చేసుకోవటమే లక్ష్యం అని సీఎం తెలిపారు.