రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)…బీజేపీ హ్యాట్రిక్ విజయాల వెనుక ఉన్న శక్తి. చాలామంది బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వారే. ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లోనే బీజేపీ నడుస్తుందని, చాలా టికెట్లు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రికమండేషన్ పై ఫిక్సవుతుంటాయని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తుంటారు.
హిందుత్వ ఎజెండాను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లే ఆర్ఎస్ఎస్ కు అనుబంధంగా ఉన్న బీజేపీ…హ్యాట్రిక్ విజయాలు సాధించింది. ఆర్ఎస్ఎస్ మద్దతు ఎల్లపుడూ బీజేపీకి తప్ప కాంగ్రెస్ కు ఉండే ఛాన్సే లేదన్న భావన జనాల్లో పాతుకుపోయింది. అయితే, అది కరెక్టు కాదంటున్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్.
తాము పాలసీలకు మద్దతిస్తామని, పార్టీలకు, మనుషులకు కాదని భగవత్ అన్నారు. అయోధ్యలో రామ మందిరం కట్టాలన్నది కోట్లాది మంది హిందువుల కల అని, ఆ కల నెరవేర్చాలన్నది ఆర్ఎస్ఎస్ ఆశయం అని ఆయన చెప్పారు. రామ మందిర నిర్మాణానికి బీజేపీ నడుం బిగించడంతోనే ఆర్ఎస్ఎస్ ఆ పార్టీకి మద్దతిచ్చిందని అన్నారు. ఒకవేళ రామ మందిరం నిర్మిస్తామని కాంగ్రెస్ చెప్పి ఉంటే ఆ పార్టీకి మద్దతిచ్చేవారమని స్పష్టం చేశారు.
ఓటు రాజకీయాల్లో తాము పాల్గొనబోమని, సమాజాన్ని ఏకం చేయడమే సంఘ్ పరివార్ లక్ష్యమని అన్నారు. కానీ, సమాజాన్ని విభజించి ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడమే రాజకీయ పార్టీల స్వభావనమి, అందుకే రాజకీయాలకు తాము దూరంగా ఉంటామని చెప్పారు.
తాము రాజకీయాలకు మద్దతిస్తామని, పాలసీల పరంగా ఆ మద్దతు ఉంటుందని తెలిపారు. అయితే, చెప్పడానికి ఇదంతా బాగానే ఉందని, కానీ, ఆర్ఎస్ఎస్ సెక్యులర్ భావజాలాన్ని కలిగి ఉండదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ సెక్యులర్ భావజాలాన్ని కలిగి ఉంటుందని, కాబట్టే ఆ పార్టీకి ఆర్ఎస్ఎస్ మద్దతునివ్వడం దాదాపుగా అసాధ్యమని అంటున్నారు.