ఒక మూవీ కాన్సెప్ట్ గురించి ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు సినిమాలో లేని సన్నివేశాలతో ప్రోమోలు తయారు చేయడం మామూలే. పోస్టర్లను కూడా ఇలాగే డిజైన్ చేస్తుంటారు. అయితే కొన్నిసార్లు ఇవి ప్రేక్షకుల్లో తప్పుడు అంచనాలకు దారి తీస్తుంటాయి. ప్రోమోలను చూసి ఏదో ఊహించుకుని థియేటర్లకు వెళ్లి.. సినిమాలో ఆ సన్నివేశాలు లేవని నిరాశ చెందడం జరుగుతుంటుంది.
తాను డైరెక్ట్ చేసిన అవును సినిమా విషయంలో ఒక ప్రేక్షకుడు ఇలాగే బాగా డిజప్పాయింట్ అయి తనకు ఫోన్ చేసి చెడామడా తిట్టినట్లు రవిబాబు తెలిపాడు. ఆ సినిమానే.. అవును. రవిబాబు కెరీర్లో పెద్ద హిట్టయిన చిత్రాల్లో ఇదొకటి. ఈ హార్రర్ మూవీ అప్పట్లో మంచి విజయం సాధించింది. తన సినిమాల పోస్టర్ల విషయంలో రవిబాబు క్రియేటివ్‌గా ఆలోచిస్తాడన్న సంగతి తెలిసిందే.
సినిమాలో కథానాయికకు దయ్యం రూపంలో పెద్ద సమస్య తలెత్తుతుంది. ఆ సమస్యను పోస్టర్లలో మెటాఫర్ రూపంలో చూపించేందుకు ఆయన ఏనుగు రెఫరెన్స్ తీసుకున్నాడు. ఏనుగు ఒక అమ్మాయిని నలిపేస్తున్నట్లుగా చూపించాడు. ఐతే రాజమండ్రికి చెందిన ఒక వ్యక్తి.. ఇది ఏనుగుల మీద తీసిన సినిమా అనుకుని తన పిల్లల్ని తీసుకుని థియేటర్‌కు వెళ్లాడట. కానీ సినిమాలో ఏనుగు లేకపోయేసరికి రవిబాబు నంబర్ కనుక్కుని మరీ ఫోన్ చేసి తిట్టాడట. ఇదేం సినిమా అయ్యా.. పోస్టర్లలో ఏనుగులున్నాయి, సినిమాలో లేవేంటి.. ఏదో పిచ్చి సినిమా తీశావు అంటూ రవిబాబు మీద విరుచుకుపడ్డాడట.
తాను అదొక మెటాఫర్ అని వివరించి చెప్పే ప్రయత్నం చేసినా కూడా అతను అర్థం చేసుకోలేదని.. చాల్లే ఊరుకోవయ్యా అంటూ కసురుకుని ఫోన్ పెట్టేశాడని రవిబాబు తెలిపాడు. పూర్ణ లీడ్ రోల్ చేసిన అవునులో దయ్యం పాత్ర చేసింది రవిబాబే. సురేష్ బాబు ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా హిట్ కాగా.. దీనికి కొనసాగింపుగా అవును02 తీస్తే అది ఆడలేదు. చాన్నాళ్లుగా సినిమాలు చేయని రవిబాబు.. ఈటీవీ విన్ కోసం ఏనుగు తొండం ఘటికాచలం అనే కామెడీ మూవీ తీశాడు.