hyderabadupdates.com movies అవే నా ప్ర‌పంచం: ప‌వ‌న్ ఇంట్ర‌స్టింగ్ కామెంట్స్‌

అవే నా ప్ర‌పంచం: ప‌వ‌న్ ఇంట్ర‌స్టింగ్ కామెంట్స్‌

జ‌న‌సేన పార్టీ అధినేత‌, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. “అవే నా ప్ర‌పంచం.. నేను వాటితో స్నేహం చేయ‌డానికి ఇష్ట‌ప‌డ‌తా. అందుకే.. ఆ రూమ్ నుంచి వాటితో నింపేసుకుంటా“ అని వ్యాఖ్యానించారు. దీంతో స‌భికులు తొలుత విస్మ‌యం వ్య‌క్తం చేసినా.. చివ‌ర‌కు ముసిముసి న‌వ్వులు చిందించారు. తాజాగా విజ‌య‌వాడ‌లో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో “ఆమె సూర్యుడిని క‌బ‌ళించింది!.“ అని పుస్త‌కాన్ని ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆవిష్క‌రించారు.

ఈ పుస్త‌కాన్ని ఒడిశాకు చెందిన ప్ర‌ముఖ ర‌చ‌యిత‌, వృత్తి రీత్యా ఐక్య‌రాజ్య‌స‌మితిలో భార‌తదేశం త‌ర‌ఫున డిప్యూటీ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్‌గా ప‌నిచేసిన ల‌క్ష్మీ ముర్డేశ్వ‌ర్ పురి ర‌చించారు. ఇంగ్లీష్ లో ర‌చించిన ఈ పుస్త‌కాన్ని ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. పురుష ర‌చ‌యిత‌ల‌కు దీటుగా ఒక‌ప్పుడు మ‌హిళా ర‌చ‌యితులు వ‌ర్థిల్లార‌ని తెలిపారు. ప్ర‌స్తుత డిజిట‌ల్ ప్ర‌పంచంలో పుస్త‌కాలు చ‌దివే వారు.. రాసేవారు కూడా.. క‌నిపించ‌డం లేద‌ని విమ‌ర్శించారు. ఇది చాలా ఆందోళ‌న‌క‌ర‌మ‌న్నారు.

తాను వ్య‌క్తిగ‌తంగా పుస్త‌క ప్రియుడిన‌ని చెప్పిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఇప్ప‌టికే తాను 2 వేల పుస్త‌కాల‌కు పైగా ఔపోస‌న పట్టిన‌ట్టు చెప్పారు. “నాకు ఏ చిన్న బాధైనా.. పుస్త‌కాల‌తోనే పంచుకుంటా. వాటిలో అనేక సూక్ష్మ సందేహాల‌కు కూడా స‌మాధానం ల‌భిస్తుంది. మ‌న‌సు ప్ర‌శాంతంగా ఉంటుంది. అందుకే.. వాటితోనే నా ప్ర‌పంచాన్ని అల్లుకున్నా. మాన‌సిక ప‌రిప‌క్వ‌త‌కు పుస్త‌క ప‌ఠ‌నం దివ్వ ఔష‌ధం. పుస్త‌కాలు చ‌దివిన వారికి ఎదురు ఉండ‌ద‌ని.. వాటిని ఒంట‌బట్టించుకుని.. ఆ సిద్ధాంతాల ప్ర‌కారం ముందుకు సాగాలి.“ అని నేటి యువ‌త‌కు పిలుపునిచ్చారు.

రోజుకు అర‌గంటైనా..

ప్ర‌స్తుతం డిప్యూటీ సీఎంగా బాధ్య‌తలు పెర‌గ‌డంతో త‌న‌కు స‌మ‌యం చిక్క‌డం లేద‌ని ప‌వ‌న్ అన్నారు. అయిన‌ప్ప‌టికీ.. మ‌న‌సు ఉంటే మార్గం ఉంటుంద‌న్న‌ట్టుగా.. ఓ అర‌గంట సేపైనా పుస్త‌కాల‌తో స్నేహం చేస్తున్నాన‌ని చెప్పారు. అనేక విష‌యాలు మ‌న‌కు పుస్త‌కాల ద్వారానే తెలుస్తాయ‌ని చెప్పారు. “మ‌న‌కు ఎంతో మంది స్నేహితులు ఉంటారు. కానీ, విజ్ఞానాన్ని పంచే.. మ‌న ప్ర‌య నేస్తం మాత్రం పుస్త‌క‌మే“ అని చెప్పుకొచ్చారు. నేటి త‌రం యువ‌త ఈ విష‌యాన్ని గ్ర‌హిస్తే.. చాలా బాగుంటుంద‌న్నారు.

Related Post