నవంబరు నెలలో సాధారణంగా భారీ చిత్రాల సందడి ఉండదు. చిన్న, మిడ్ రేంజ్ మూవీస్ మాత్రమే విడుదలవుతుంటాయి. ఈ నెలలో తొలి రెండు వారాల్లో గర్ల్ ఫ్రెండ్, కాంత లాంటి మిడ్ రేంజ్ సినిమాలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. వీటిలో గర్ల్ ఫ్రెండ్ ఓ మోస్తరుగా ఆడింది. కాంత అంచనాలను అందుకోలేకపోయింది. వచ్చే వారం 12ఏ రైల్వే కాలనీ సహా కొన్ని చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
ఐతే ఈ నెల మొత్తంలో ఎక్కువ అంచనాలున్న సినిమా అంటే.. రామ్ ప్రధాన పాత్ర పోషించిన ఆంధ్రా కింగ్ తాలూకా అనే చెప్పాలి. ఎక్కువగా మాస్ మూవీస్ చేసే రామ్.. ఈసారి ఒక ఫ్యాన్ బయోపిక్ అంటూ ఈ వెరైటీ మూవీ చేశాడు. ఇందులో ఉపేంద్ర స్టార్ హీరో పాత్ర పోషించగా.. ఆయనకు అభిమానిగా రామ్ కనిపించనున్నాడు. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఫేమ్ మహేష్ బాబు ఈ చిత్రాన్ని రూపొందించాడు. మైత్రీ మూవీ మేకర్స్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసింది.
ఆంధ్రా కింగ్ తాలూకాకు మొదట ప్రకటించిన రిలీజ్ డేట్ నవంబరు 28. కానీ ఇప్పుడు డేట్ మార్చారు. అలా అని ఆ సినిమా ఏమీ వాయిదా పడట్లేదు. అనుకున్న దాని కంటే ఒక రోజు ముందే ప్రేక్షకులను పలకరించబోతోంది ఆంధ్రా కింగ్ తాలూకా. నవంబరు 27నే సినిమాను రిలీజ్ చేసేస్తున్నారు. ముందు యుఎస్ ప్రిమియర్స్‌ను రిలీజ్ డేట్ కంటే రెండు రోజుల ముందు వేయాలని అనుకున్నారు. ఇప్పుడు మొత్తంగా రిలీజ్ డేటే ఒక రోజు ముందుకు వచ్చింది. అంటే యుఎస్ ప్రిమియర్స్ ఎప్పట్లాగే ఒక రోజు ముందు పడనున్నాయి.
గురువారం రోజు రిలీజ్ కావడం వల్ల లాంగ్ వీకెండ్ సినిమాకు అడ్వాంటేజ్ కానుంది. తర్వాతి వారంలో అఖండ-2 లాంటి భారీ చిత్రం రిలీజవుతుండడంతో గ్యాప్ కొంచెం ఎక్కువ ఉండేలా సినిమాను ఒక రోజు ముందుకు తీసుకొచ్చినట్లున్నారు. 28న కీర్తి సురేష్ సినిమా రివాల్వర్ రీటా రిలీజ్ కానుండగా.. దాంతో క్లాష్ కూడా లేకుండా చూసుకున్నట్లున్నారు. చాన్నాళ్లుగా సరైన హిట్ లేని రామ్‌కు ఈ సినిమా సక్సెస్ కావడం చాలా అవసరం.