hyderabadupdates.com movies ఆర్జీవీ గట్టిగా ట్రై చేస్తున్నాడు కానీ…

ఆర్జీవీ గట్టిగా ట్రై చేస్తున్నాడు కానీ…

ఒక భారీ భవంతిని పేలుడు పదార్థాలు వాడి నిమిషాల్లో ధ్వంసం చేయొచ్చు. కానీ అదే భవంతిని కట్టడానికి సంవత్సరాలు పడుతుంది. అదే రకంగా ఒక మనిషికి మంచి పేరు రావడానికి చాలా సమయం పడుతుంది. కానీ చెడ్డపేరు తెచ్చుకోవడానికి నిమిషం చాలు. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అత్యంత గొప్ప దర్శకుల్లో ఒకడిగా ఎదిగిన రామ్ గోపాల్ వర్మ.. గత కొన్నేళ్లలో ఎంతగా అప్రతిష్టపాలయ్యాడో తెలిసిందే. ఫ్లాప్ సినిమాలు అందరూ తీస్తారు కానీ.. అందులో తప్పుబట్టాల్సిందేమీ లేదు. 

కానీ రాజకీయ అజెండాతో, దురుద్దేశాలతో ఆయన ఎంత ఘోరమైన సినిమాలు తీశారో అందరికీ తెలుసు. అది చాలదన్నట్లు ట్విట్టర్ వేదిక వర్మ పెట్టిన పోస్టులు, చేసిన కామెంట్ల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ముఖ్యంగా మెగా ఫ్యామిలీలో చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లను ఉద్దేశించి కొన్నేళ్ల పాటు ఆయన తన స్థాయికి తగని పోస్టులు, కామెంట్లతో అభిమానుల్లో తీవ్ర వ్యతిరేకత తెచ్చుకున్నారు. 

వర్మ డై హార్డ్ ఫ్యాన్స్ సైతం ఆయన సినిమాలు, వ్యవహార శైలికి విసుగెత్తిపోయి.. ఆయన పేరెత్తితే మంటెత్తిపోయే స్థాయికి చేరుకున్నారు. తన సినిమాలకు, తన మాటకు ఏమాత్రం విలువ లేకుండా చేసుకున్నాడు వర్మ. చివరగా ఆయన ‘కొండా’ అనే సినిమా తీస్తే.. తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక వందమందైనా ఆ చిత్రాన్ని చూశారా అన్నది సందేహమే. ‘శివ’ సహా అనేక సెన్సేషనల్ మూవీస్‌తో ఒకప్పుడు దేశాన్ని ఊపేసిన దర్శకుడి పతానికి ఇంతకంటే పరాకాష్ట ఏముంటుంది?

ఐతే తాను దారుణమైన తప్పులు చేస్తున్నపుడు ఎన్ని విమర్శలు వచ్చినా, ఎవరైనా ఆయన్ని మార్చాలని చూసినా పట్టించుకోలేదు వర్మ. పైగా పిచ్చి లాజిక్కులతో ఎదురుదాడి చేశాడు. కానీ గత ఏడాది వైసీపీ ఘోర పరాజయం పాలైన కొన్ని నెలల తర్వాత వర్మకు జ్ఞానోదయం అయింది. ఈ రాజకీయ మకిలి అంటించుకోవడంతో జరిగిన డ్యామేజీ ఏంటో తెలిసొచ్చింది. ఇక అప్పట్నుంచి తనకు రాజకీయాలకు సంబంధం లేదని చెప్పి సినిమాల మీద ఫోకస్ చేస్తున్నాడు. ఇకపై మంచి సినిమాలు చేస్తా అని ప్రకటన కూడా ఇచ్చాడు. 

అంతే కాక ఇప్పుడు మెగా ఫ్యామిలీ హీరోల గురించి పాజిటివ్ పోస్టులు కూడా వేస్తున్నాడు. ఎన్నడూ లేని విధంగా చిరంజీవికి క్షమాపణ కూడా చెప్పాడు వర్మ. ఇలాంటి ట్వీట్ ఆయన్నుంచి ఊహించనిదే. తాజాగా చరణ్ మీద ప్రశంసలు కురిపిస్తూ ‘పెద్ది’ సినిమా పాట మీద ఒక పోస్టు పెట్టాడు. కానీ ఏళ్ల తరబడి అదే పనిగా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసి ఇప్పుడు తాను మారిన మనిషిని అని చెప్పి రెండు పాజిటివ్ ట్వీట్లు వేస్తే అభిమానులు ఎలా ఆయన్ని మన్నించేస్తారు. ఇకపై మంచి సినిమాలు తీస్తా.. తర్వాతి సినిమాలో నేనేంటో చూపిస్తా అనే స్టేట్మెంట్ల మీద కూడా జనాలకు నమ్మకం కలగట్లేదు. నిజంగా ఓ మంచి సినిమా తీసి చూపించి.. కొన్నేళ్ల పాటు హుందాగా ప్రవర్తించి చూపిస్తే తప్ప వర్మ కోల్పోయిన క్రెడిబిలిటీ తిరిగి రాదు.

Related Post