టీడీపీ ఎమ్మెల్యేల పనితీరుపై తరచుగా సమీక్షిస్తున్న ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్.. తాజాగా జిల్లాల వారీగా ఎమ్మెల్యేలపై సమీక్షించారు. ప్రధానంగా 3 అంశాలపై ఆయన దృష్టి పెడుతున్నారు. 1) ప్రజల మధ్య ఉండడం. 2) ప్రజాదర్బార్‌లు నిర్వహించడం. 3) కేడర్‌తో సమావేశాలు నిర్వహించడం. ఈ మూడు అంశాలపై తరచుగా ఎమ్మెల్యేలకు ఆయన దిశానిర్దేశం చేస్తున్నారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. ఎమ్మెల్యేలు ఈ మూడు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని చెబుతున్నారు. అయితే.. కొందరు ఈ మూడు సూత్రాలను ఫాలో అవుతుంటే.. మరికొందరు విస్మరిస్తున్నారు.
తాజాగా కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్యేల పనితీరును మంత్రి సమీక్షించారు. అయితే.. ముగ్గురు ఎమ్మెల్యేల పనితీరు ఏమాత్రం బాగోలేదని కుండబద్దలు కొట్టారు. “మీరు ఏం చేస్తున్నారో నాకు అర్ధం కావడం లేదు“ అని వ్యాఖ్యానించారు. ప్రజల మధ్య ఉండరు.. పార్టీ కేడర్‌ను పట్టించుకోరు.. ప్రజల సమస్యలు వినరు.. ఇంక ఏం చేస్తున్నారు? అని నారా లోకేష్ వారిని నిలదీశారు. ఇక నుంచి అయినా.. పరిస్థితిని సరిచేసుకోవాలని.. ప్రత్యర్థులు పుంజుకోకముందే.. మీరు పుంజుకోవాలని..ఇప్పుడున్న గ్రాఫ్ సరిపోతుందని అనుకోవద్దని కూడా ఆయన చెప్పారు. ప్రతి విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలన్నారు.
వారు వీరే..
1) కడప: కడప అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న రెడ్డప్పగారి మాధవీరెడ్డిపై లోకేష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. “అమ్మా మీరు గట్టిగా మాట్లాడగలరు. కానీ, ప్రజల సమస్యలపై స్పందించడంలేదు. పార్టీ కేడర్‌ను కలవడం లేదు. ఇది సరికాదు“ అని తేల్చి చెప్పారు. కాగా.. గత 2024 ఎన్నికల్లో తొలిసారి విజయం దక్కించుకున్న మాధవీ రెడ్డి తరచుగావివాదాల్లో చిక్కుకుంటున్నారు. అధికారులపై చిందులు తొక్కుతున్నారన్న విమర్శలు వున్నాయి.
2) మైదుకూరు: కడప జిల్లాలోని కీలక నియోజకవర్గం మైదుకూరులో తొలిసారి పుట్టా సుధాకర్ యాదవ్ విజయం దక్కించుకున్నారు. వరుస పరాజయాల తర్వాత..మూడోసారి ఆయనను విజయం వరించింది. కానీ,ఆయన కూడా ప్రజల మధ్య ఉండడం లేదని లోకేష్ వ్యాఖ్యానించారు. ఈయన మాజీ మంత్రి యనమల రామకృష్ణుడుకు వియ్యంకుడు కావడం గమనార్హం. పద్ధతి మార్పుకోవాలని.. కేడర్‌ను కలుపుకొని పోవాలని ఆయనకు లోకేష్ దిశానిర్దేశం చేశారు.
3) ప్రొద్దుటూరు: ఇక్కడ నుంచి సీనియర్ మోస్టు నాయకుడు.. నంద్యాల వరదరాజుల రెడ్డి విజయం దక్కించుకున్నారు. గతంలో ఆయన 1985 నుంచి 2004 వరకు ఐదు సార్లు విజయం సాధించారు. 2024 ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కారు. అయితే.. ఇటీవల అనారోగ్యం కారణంగా యాక్టివ్‌గా ఉండలేక పోతున్నారు. ఈ విషయాన్నే లోకేష్ ప్రస్తావించి.. సాధ్యమైనంత వరకు ప్రజల మధ్య ఉండాలన్నారు.