ఎప్పుడో 2019 వన్డే ప్రపంచకప్‌లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు మహేంద్రసింగ్ ధోని. ఆ తర్వాతి ఏడాది అధికారికంగా ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ తర్వాత ఐపీఎల్‌లో కొనసాగినా.. తన ప్రదర్శన ఒకప్పటి స్థాయిలో సాగలేదు. మూణ్నాలుగేళ్ల ముందు నుంచే ఐపీఎల్ రిటైర్మెంట్ గురించి చర్చ జరుగుతున్నా.. ఒక్కో సీజన్‌ను పొడిగించుకుంటూ వస్తున్నాడు.
కెప్టెన్‌గా తన వారసుడిగా ముందు జడేజాను తీర్చిదిద్దాలనుకున్నాడు. కానీ కుదరలేదు. తర్వాత రుతురాజ్ గైక్వాడ్‌ను ముందుకు తెచ్చాడు. కానీ అతనూ ధోని మ్యాజిక్‌ను రిపీట్ చేయలేకపోయాడు. చెన్నై సూపర్ కింగ్స్ బ్రాండ్ వాల్యూ అంతా ధోని మీదే ఆధారపడి ఉండడంతో ఆ ఫ్రాంఛైజీ అతణ్ని వదులుకోవట్లేదు.
ఈ సీజన్‌కు కూడా మహిని కొనసాగించాలని చూసింది. కానీ ఐపీఎల్-2026లో ఇప్పటికే సగానికి పైగా మ్యాచ్‌లు అయిపోయాయి. కానీ సీజన్లో ధోని ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. లీగ్ ఆరంభం కాబోతుండగా.. ధోనికి గాయమన్నారు. రెండు వారాలు దూరమన్నారు. కానీ టోర్నీ మొదలై నాలుగు వారాలు కావస్తున్నా.. ధోని అడ్రస్ లేడు.
చెన్నై ఆడే ప్రతి మ్యాచ్‌కూ ఫ్యాన్స్ విరగబడి వస్తున్నారు. ధోనీ ఆడతాడేమో అని చూస్తున్నారు. కానీ అతను మాత్రం బరిలోకి దిగట్లేదు. ధోని రెండు వారాలు దూరం అన్న సీఎస్కే యాజమాన్యం.. ఆ రెండు వారాలు గడిచాక ఎలాంటి అప్‌డేట్ ఇవ్వట్లేదు. అసలీ సీజన్లో ధోని ఒక్క మ్యాచ్ అయినా ఆడతాడో లేదో, తన భవితవ్యమేంటో స్పష్టత లేదు.
చెన్నైతో మ్యాచ్ అంటే.. ధోని పేరు చెప్పి అన్ని ఫ్రాంఛైజీలూ ఎక్కువ రేట్లు పెట్టి టికెట్లు అమ్మేసుకుంటున్నాయి. తీరా మ్యాచ్ మొదలయ్యాక ఫ్యాన్స్ ఫూల్స్ అవుతున్నారు. ధోనికి ఇప్పటికే 44 ఏళ్లు నిండిపోయాయి. అతను మునుపటిలా ఫిట్‌గా లేడన్నది స్పష్టం. ఆట కూడా అంతంతమాత్రమే. మహా అయితే ఈ సీజన్ ఆడి నిష్క్రమిస్తాడని అనుకున్నారు ఫ్యాన్స్.
కానీ అభిమానులను అలరించడం కోసమైనా ధోని కొన్ని మ్యాచ్‌ల్లో బరిలోకి దిగుతాడనుకుంటే అలాంటిదేమీ జరగట్లేదు. మరి సీజన్ చివర్లో అయినా మహి మెరుస్తాడేమో చూడాలి. విశ్లేషకులైతే ధోని కెరీర్ ముగిసినట్లే అని.. తన నిర్ణయాన్ని సీఎస్కే యాజమాన్యానికి కూడా చెప్పేశాడని.. హఠాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించకుండా ఫ్యాన్స్‌ను కూడా ప్రిపేర్ చేయిస్తున్నాడని.. చివరగా చెన్నై చెపాక్ మైదానంలో ఒక మ్యాచ్ ఆడి రిటైర్మెంట్ తీసుకునే అవకాశాలున్నాయని అంటున్నారు.