ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ గ్యాస్ కొరత తీవ్రంగా కనిపిస్తోంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడటంతో ఇప్పటికే ముంబై, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో చాలా హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. తాజాగా హైదరాబాద్ లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ లోని ఐటీ కారిడార్ ప్రాంతంలోని హాస్టళ్లు గ్యాస్ కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి.
ఐటీ కారిడార్ లోని సుమారు 1,100 హాస్టళ్లలో నివసిస్తున్న 10 నుంచి 11 లక్షల మంది ఐటీ ఉద్యోగులు, విద్యార్థులకు కష్టాలు తప్పడం లేదు. పొద్దున్నే ఇరానీ చాయ్ తాగే విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు ఇప్పుడు ఆ టీ కూడా తాగలేని పరిస్థితి ఏర్పడింది. టీ, కాఫీ, ఇడ్లీ, దోసె, చపాతీ, పూరీ వంటి బ్రేక్ ఫాస్ట్ ఐటమ్స్ మెనూల నుంచి మాయమయ్యాయి. వాటి బదులుగా సాంబార్ రైస్, పులిహోర, కర్డ్ రైస్ వంటి ఆహారాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
కొన్ని హాస్టళ్ల నిర్వాహకులు వంట చేసేందుకు కట్టెల పొయ్యులను ఉపయోగిస్తున్నారు. గ్యాస్ దాదాపు అయిపోయిందని, వేలాది మందికి భోజనం తయారు చేయడానికి గ్యాస్ సరిపోవడం లేదని ఐటీ కారిడార్ హాస్టల్ అసోసియేషన్ ట్రెజరర్ వెల్లంపల్లి మహీధర్ తెలిపారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 1,950 రూపాయల నుంచి 2,300 రూపాయలకు పెరిగినా కూడా దొరకడం లేదని చెప్పారు.
పరిస్థితి త్వరగా మెరుగుపడకపోతే హాస్టళ్లు మూసివేయాల్సి వచ్చే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. అలా జరిగితే ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ చేయాల్సిన పరిస్థితి వస్తుందని, చాలామంది తమ స్వస్థలాలకు వెళ్లే పరిస్థితి రావచ్చని తెలిపారు. ప్రభుత్వం జోక్యం చేసుకొని హాస్టళ్లకు స్థిరంగా గ్యాస్ సరఫరా చేయాలని ఆయన కోరారు.