hyderabadupdates.com movies ఇరాన్‌లో భారతీయ విద్యార్థులు.. ఇటు ప్రాణాలు, అటు పరీక్షలు

ఇరాన్‌లో భారతీయ విద్యార్థులు.. ఇటు ప్రాణాలు, అటు పరీక్షలు

ఇరాన్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా హెచ్చరికలతో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో భారత రాయబార కార్యాలయం తమ పౌరులను తక్షణమే దేశం విడిచి వెళ్లాలని అడ్వైజరీ జారీ చేసింది. కానీ అదే సమయంలో మెడికల్ విద్యార్థులకు కీలకమైన పరీక్షలు ఉండటంతో, వారు ప్రాణాలు కాపాడుకోవాలా లేక చదువును కాపాడుకోవాలా అనే సందిగ్ధంలో పడ్డారు.

ముఖ్యంగా మార్చి 5న ఇరాన్ వ్యాప్తంగా ‘ఉలూంపాయ’ (బేసిక్ సైన్స్ ఎగ్జామ్), ప్రీ ఇంటర్న్‌షిప్ పరీక్షలు జరగాల్సి ఉంది. ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ పరీక్షలు మెడికల్ విద్యార్థులకు అత్యంత కీలకం. వీటిలో ఉత్తీర్ణులైతేనే విద్యార్థులు తదుపరి క్లినికల్ ట్రైనింగ్‌కు వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ పరీక్షలు ఏడాదికి రెండు సార్లు మాత్రమే జరుగుతాయి కాబట్టి, ఇప్పుడు వీటిని వదులుకుంటే విద్యార్థులు ఆరు నెలల విద్యా సంవత్సరాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.

భారతదేశం నుండి సుమారు 1,000 నుండి 1,500 మంది విద్యార్థులు ఇరాన్‌లోని టెహ్రాన్ యూనివర్సిటీ వంటి ప్రముఖ సంస్థల్లో మెడిసిన్ చదువుతున్నారు. వీరిలో జమ్మూ కాశ్మీర్‌కు చెందిన వారు అధిక సంఖ్యలో ఉన్నారు. ఇప్పటికే గత ఏడాది ఇజ్రాయెల్ ఇరాన్ గొడవల వల్ల ఒకసారి చదువు కుంటుపడిందని, ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి ఎదురవ్వడంపై విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూనివర్సిటీలు పరీక్షలను వాయిదా వేసే సూచనలు కనిపించకపోవడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ స్టూడెంట్స్ అసోసియేషన్ భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు (MEA) ఒక విన్నపం చేసింది. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఇరాన్ ప్రభుత్వంతో మాట్లాడాలని, పరీక్షలను వాయిదా వేసేలా లేదా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేలా చూడాలని కోరింది.

విద్యార్థులు తమ ప్రాణాలను పణంగా పెట్టి పరీక్షలు రాయడం సాధ్యం కాదని, అలాగే వారి విద్యా సంవత్సరం వృథా కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సంఘం నేతలు స్పష్టం చేశారు.

ప్రస్తుతానికి కొంతమంది విద్యార్థులు భద్రతా కారణాల దృష్ట్యా స్వదేశానికి తిరిగి వస్తున్నా, వారి మనసంతా పరీక్షల మీదనే ఉంది. అటు కుటుంబ సభ్యుల ఒత్తిడి, ఇటు భవిష్యత్తుపై ఆందోళన మధ్య విద్యార్థులు నలిగిపోతున్నారు. ప్రభుత్వం నుండి స్పష్టమైన మార్గదర్శకాలు వస్తేనే తమకు ఒక దారి దొరుకుతుందని వారు ఆశిస్తున్నారు. మరి విదేశీ వ్యవహారాల శాఖ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

Related Post

Thaman reveals why he isn’t scoring music for Trivikram’s Adarsha KutumbamThaman reveals why he isn’t scoring music for Trivikram’s Adarsha Kutumbam

Currently, Trivikram is busy shooting Adarsha Kutumbam, a family entertainer headlined by Victory Venkatesh. The film is slated to hit the big screens in the second half of 2026. Of