బీహార్ అసెంబ్లీ సహా, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లోని అసెంబ్లీలలో ఖాళీ అయిన ఎమ్మెల్యే స్థానాలకు ఉప ఎన్నిక జరగనున్నాయి. నవంబరు 9, 11 తేదీల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. జమ్ము కశ్మీర్‌లోని సీఎం ఒమర్ అబ్దుల్లా నియోజకవర్గం బుడ్గమ్ నియోజకవర్గానికి, అదేవిధంగా మరొక నియోజకవర్గం నగ్రోతాలకు ఉప ఎన్నిక జరగనుంది. ఇక బీహార్‌లో 243 అసెంబ్లీ స్థానాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. అలాగే తెలంగాణలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నిక జరగనుంది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఈ ఉప ఎన్నికలను ప్రాధాన్యంగా భావిస్తున్నాయి.
ఈ క్రమంలో ప్రచార పర్వానికి అన్ని ప్రాంతాల్లోనూ 15-17 రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో ప్రచార పర్వంలో అన్ని పార్టీలు కీలక రోల్ పోషిస్తున్నాయి. సహజంగా గత సార్వత్రిక ఎన్నికల సమయంలో అన్ని రూపాల్లోనూ ప్రచారం జోరుగా సాగింది. దీనిలో ప్రధానంగా సోషల్ మీడియా కీలక రోల్ పోషించింది. మీమ్స్ నుంచి కామెంట్ల వరకు, వీడియోల నుంచి ఆడియోల వరకు, సినిమాల నుంచి సీరియళ్ల వరకు కూడా ప్రచారాన్ని పార్టీలు జోరుగా ముందుకు తీసుకువెళ్లాయి. ముఖ్యంగా చేతిలో ఉండే ఫోన్‌లో వాట్సాప్, యూట్యూబ్ ప్రచారాల ద్వారా ప్రజలకు చేరువయ్యేందుకు పార్టీలు ప్రయత్నించాయి.
అయితే ఈసారి బీహార్ నుంచి ఉప ఎన్నికలు జరవబోయే రాష్ట్రాల వరకూ కూడా సోషల్ మీడియాలో పెద్దగా కదలిక కనిపించడం లేదు. అంతా బహిరంగ ప్రచారానికే పార్టీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. నిజానికి సోషల్ మీడియాలో వీడియోలు, కామెంట్లు వస్తాయని అందరూ అనుకున్నా, ఈసారి పార్టీలు వాటికి దూరంగా ఉన్నాయి. గత ఎన్నికల సమయంలో ఉన్న జోరు ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపించడం లేదు. స్వల్పంగానే ప్రచారం సాగుతోంది. అది కూడా ఎక్కడా పరుషపదాలు వాడకుండా, వ్యక్తిగత విమర్శలు చేయకుండా, పార్టీపై ఎద్దేవా చేయకుండా సోషల్ మీడియా ప్రచారం సైలెంట్ అయిపోయింది.
దీనికి కారణం ఈ దఫా ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం సోషల్ మీడియాపై అనేక ఆంక్షలు విధించింది. సోషల్ మీడియా ప్రచారం చేసుకునేవారు ముందుగానే ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ చేసుకోవాలని ఆదేశించింది. అంతేకాదు ప్రతి వీడియో, ఆడియోను ఎన్నికల అధికారి మానిటరింగ్ చేస్తారని తెలిపింది. ఎవరినీ దూషించడం, ఎద్దేవా చేయడం, వెకిలి వ్యాఖ్యలు చేయడం వంటి వాటిని పూర్తిగా నిషేధించింది. యూట్యూబ్, ట్విట్టర్, వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టా ఇలా అన్ని మాధ్యమాలపైనా కొరడా ఝళిపించింది. వీటిలో ఎక్కడైనా అభ్యర్థి ఇష్టానుసారం వ్యవహరిస్తే అభ్యర్థిత్వం రద్దు చేస్తామని హెచ్చరికలు జారీ చేసింది. దీంతో సోషల్ మీడియా ప్రచారానికి పార్టీలు దాదాపు దూరంగానే ఉన్నాయని చెప్పాలి.