ఏపీలో జిల్లాల పునర్విభజన, మండలాల సరిహద్దుల నిర్ణయం అంశం ఎటూ తేలడం లేదు. గత 2024 ఎన్నికలకు ముందు.. తాము అధికారంలోకి రాగానే.. ప్రజల అభీష్టం మేరకుకొత్త జిల్లాలు, జిల్లా కేంద్రాలు, మండలాల సరిహద్దులను మారుస్తామని.. అవసరమైతే.. కొత్త జిల్లాలను కూడా ఏర్పాటు చేస్తామని ప్రస్తుత సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈనేపథ్యంలో దీనిపై తర్వాత చూద్దామని గత ఏడాది గడిపేశారు. నిజానికి ఇది మళ్లీ ఎన్నికలకు రెండేళ్ల ముందు చేపట్టాలని తొలి మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. ఇప్పటికిప్పుడు అంత అర్జంట్ ఏముంటుంది? అనుకున్నారు.
అయితే.. ఇంతలోనే కేంద్రం నుంచి ఉరుములు లేనిపిడుగులా పెద్ద సమాచారం వచ్చింది. “2026 ఫిబ్రవరి నుంచి దేశవ్యాప్తంగా కుల, జనాభా గణనల ప్రక్రియ ప్రారంభంకానుంది. ఈక్రమంలో జిల్లాలు, మండలాల సరిహద్దులను మార్చాలని అనుకుంటే.. 2025 డిసెంబరు 31లోగా ముగించాలి. జనవరి 2026 నుంచి ఇలాంటి ప్రక్రియ చేపట్టవద్దు.” అని తేల్చి చెప్పింది. అంతేకాదు.. కుల, జనాభా గణనల వ్యవహారం 2028 చివరి వరకు జరగనుంది. ఈ లెక్కన చూస్తే.. 2029 ఎన్నికలు వచ్చేస్తాయి. దీంతో ఆగమేఘాలపై సీఎం చంద్రబాబు మంత్రి వర్గ ఉపసంఘాన్ని నియమించారు.
మంత్రి అనగాని సత్యప్రసాద్ నేతృత్వంలో వేసిన కమిటీ.. పనిచేయాలని ముందుకు వచ్చినప్పుడల్లా.. ఏదో ఒక సమస్య వెంటాడుతోంది. దీంతో జిల్లాలపై కాన్సన్‌ట్రేషన్ చేయలేక పోతున్నారు. మరోవైపు జిల్లాల విభజన, మండలాల పరిధిలు నిర్ణయించేం దుకు కేవలం 60 రోజులు మాత్రమే సమయం మిగిలి ఉంది. ఇక, గత వైసీపీ హయంలోనే ఈ ప్రక్రియ చేపట్టి.. 13 ఉమ్మడి జిల్లాలను 26 జిల్లాలుగా(పార్లమెంటునియోజకవర్గం) ప్రకటించారు. కానీ, అప్పట్లో ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యం ఇవ్వలేదన్న వాదన ఉంది. అంతేకాదు.. ప్రజల డిమాండ్లను పట్టించుకోలేదని పెద్ద ఎత్తున నిరసనలు, ఉద్యమాలు కూడా వచ్చాయి.
ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం.. ప్రస్తుతం చేపట్టిన జిల్లాల విభజన కు సంబంధించి ప్రజల నుంచి మూడు రూపాల్లో అభిప్రాయాలు తీసుకుంటోంది. ఈమెయిల్, ఐవీఆర్ ఎస్, లేఖలు.. రూపంలో జిల్లాలు, మండలాల హద్దుల విభజనపై ప్రజల అభిప్రాయం కోరింది. దీంతో ప్రజల నుంచి భారీ ఎత్తున స్పందన వచ్చింది. కొందరు మరో 10 జిల్లాలు ఉండాలని.. మరికొందరు రాష్ట్రంలో 5-10 జిల్లాలు ఏర్పాటు చేయాలని.. మండల కేంద్రాలను మార్చాలని పెద్ద ఎత్తున కోరారు. ఇవన్నీ అధ్యయనం చేసేందుకు భారీగా సమయం పట్టనుంది. మరోవైపు.. నిర్ణీత వ్యవధి(డిసెంబరు 30) వచ్చేస్తోంది. దీంతో ప్రజల అభిప్రాయాలు అడిగామన్న భావన ఉన్నా.. ఇన్ని పెద్ద సంఖ్యలో వచ్చిన విజ్ఞాపనలను ఎలా పరిగణనలోకి తీసుకుని ముందుకు సాగాలన్నది సర్కారుకు ఇబ్బందిగా మారింది. దీంతో వచ్చే నెలకు ఈ ప్రక్రియను వాయిదా వేశారు.