hyderabadupdates.com movies ఏపీలో కొత్త జిల్లాలు.. సర్కారుకు కొత్త సమస్యలు..!

ఏపీలో కొత్త జిల్లాలు.. సర్కారుకు కొత్త సమస్యలు..!

కొత్త జిల్లాల ఏర్పాటు అంశం రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో ఆశలు రేకెత్తించింది. ఈ ప్రభుత్వం అయినా తమకు న్యాయం చేస్తుందని వారు భావించారు. గతంలో వైసీపీ అధినేత జగన్ తొలిసారి 13 జిల్లాలుగా ఉన్న రాష్ట్రాన్ని 26 జిల్లాలకు పెంచారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా మార్చుతామని ప్రకటించి, అరకు వంటి పెద్ద పార్లమెంట్ స్థానాన్ని రెండు జిల్లాలుగా విభజించి మొత్తంగా 26 జిల్లాలను ఏర్పాటు చేశారు. అయితే అప్పట్లో జరిగిన తప్పుల కారణంగా ప్రజల్లో ఆందోళన, ఆవేదన వ్యక్తమైంది.

దీంతో ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా పెద్ద పీట వేయాలనే ఉద్దేశంతో ప్రస్తుత ప్రభుత్వం మరోసారి జిల్లాల విభజన అంశాన్ని తెరపైకి తెచ్చింది. జిల్లాలు, మండలాలు కొత్తగా ఏర్పాటు చేయడంతో పాటు మరికొన్ని సరిహద్దులను మార్చాలని భావించింది. అయితే ఇది వివాదంగా మారింది.

ఉదాహరణకు నెల్లూరు జిల్లాను తీసుకుంటే, ఈ జిల్లాలో ఉన్న కొన్ని మండలాలను తిరుపతి జిల్లాలోకి కలపాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. కలువాయి, రావూరు, సైదాపురం వంటి మండలాలను తిరుపతి జిల్లాలో కలపేందుకు మంత్రివర్గ ఉపసంఘం ప్రయత్నిస్తోంది.

అయితే దీనిని స్థానిక ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా చేస్తున్నారు. ఆ మండలాలను నెల్లూరులోనే ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. అదే విధంగా గూడూరును నెల్లూరు జిల్లాలో కలపాలన్న డిమాండ్ కూడా తెరపైకి వచ్చింది. దీనిని కొందరు వ్యతిరేకిస్తుండగా, మరికొందరు సమర్థిస్తున్నారు. గూడూరును నెల్లూరులోకి కలపాలంటూ బీజేపీ నాయకులు కోరుతుండగా, దీనిని టీడీపీ నాయకులు వ్యతిరేకిస్తున్నారు.

దీంతో ఇరుపక్షాల మధ్య ఈ వ్యవహారం ఇబ్బందికరంగా మారింది. అదేవిధంగా ఉదయగిరి నియోజకవర్గంలోని ఉదయగిరి ప్రాంతాన్ని ప్రత్యేక రెవెన్యూ డివిజన్‌గా మార్చాలని కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. అభివృద్ధి, తాగునీరు, అలాగే వ్యవసాయానికి సంబంధించిన అనేక అంశాల్లో ఉదయగిరి వెనుకబడి ఉందని, కాబట్టి దీనిని రెవెన్యూ డివిజన్‌గా మార్చాలని వారు కోరుతున్నారు. కానీ ఈ విషయంలో స్థానికంగా ఉన్న టీడీపీ నాయకులు వ్యతిరేకిస్తున్నారు.

మొత్తంగా రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాల్లో జిల్లాలు, డివిజన్ల విభజన వ్యవహారం ప్రభుత్వాన్ని తీవ్రంగా కుదిపేస్తోంది. మరోవైపు కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి సమయం తక్కువగా ఉండటంతో ప్రభుత్వం ఏం చేయాలన్నది ఇప్పుడు ఇరకాటంగా మారింది. చివరకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Related Post