భారతదేశంలో టెక్నాలజీ రంగానికి ఊపునిచ్చే అతిపెద్ద ప్రకటన ఇది. గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ ఇండియాలో ఏకంగా $15 బిలియన్లు (సుమారు రూ. 1.25 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. రాబోయే ఐదేళ్లలో ఈ పెట్టుబడిని పెట్టనున్నట్లు తెలిపిన గూగుల్, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో (వైజాగ్‌లో) తమ అతిపెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) హబ్‌ను ఏర్పాటు చేయనుంది.
అమెరికా వెలుపల గూగుల్ ఇంత పెద్ద AI హబ్‌ను ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి అని గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ ప్రకటించారు. గూగుల్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక, AI సర్వీసులకు ఇండియాలో పెరుగుతున్న భారీ డిమాండ్ ప్రధాన కారణం. ఈ AI హబ్‌లో భాగంగా, విశాఖపట్నం పోర్ట్ సిటీలో 1 గిగావాట్ డేటా సెంటర్ కాంపస్‌ను గూగుల్ నిర్మించనుంది.
AI ఇన్ఫ్రాస్ట్రక్చర్, భారీస్థాయిలో ఎనర్జీ సోర్సులు, విస్తృతమైన ఫైబర్ ఆప్టిక్ నెట్‌వర్క్‌ను ఇందులో ఏర్పాటు చేయనున్నారు. ఈ పెట్టుబడితో ఏపీలో పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అంచనా. ఈ కీలకమైన ఒప్పందం ఢిల్లీలో జరిగిన ఒక ఈవెంట్లో కుదిరింది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు మరియు రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ వంటి ప్రముఖులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి తన రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలను వివరించారు. నిజానికి, ప్రపంచ టెక్ కంపెనీల మధ్య ఇప్పుడు AI ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం తీవ్రమైన పోటీ నడుస్తోంది. గ్లోబల్ టెక్ దిగ్గజాలకు ఇండియా ఒక ముఖ్యమైన గ్రోత్ మార్కెట్‌గా మారింది. దేశంలో దాదాపు వంద కోట్ల మంది ఇంటర్నెట్ను వాడుతున్నారు. ఈ డిమాండ్‌ను అందుకోవడానికి మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి కంపెనీలు కూడా ఇండియాలో ఇప్పటికే బిలియన్ల కొద్దీ డాలర్లు ఖర్చు చేసి తమ డేటా సెంటర్లను నిర్మించాయి.
అయితే, గూగుల్ చేసిన ఈ $15 బిలియన్ల పెట్టుబడి ప్రకటన.. దాని ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వనుంది. కేవలం డేటా సెంటర్లకు మాత్రమే కాకుండా, ఏపీని AI పరిశోధనలు టెక్నాలజీ డెవలప్మెంట్ కోసం ఒక గ్లోబల్ సెంటర్‌గా మార్చడానికి గూగుల్ ఈ హబ్‌ను వాడుకునే అవకాశం ఉంది. మొత్తం మీద, ఈ భారీ పెట్టుబడి ప్రకటన ఇండియాలో డిజిటల్ విప్లవాన్ని మరింత వేగవంతం చేస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి టెక్నాలజీ మ్యాప్‌లో ఒక ప్రత్యేక స్థానం లభించినట్లయింది. గూగుల్ తీసుకున్న ఈ నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థకు, టెక్ పరిశ్రమకు ఒక పెద్ద బూస్ట్‌గా నిలవనుంది.