సీఎం చంద్రబాబు మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. ప్రస్తుతం దోబూచులాడుతున్న మొంథా తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో ముఖ్యంగా తీర ప్రాంత గ్రామాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు చేర్చారు. నిజానికి తుఫాను ఎఫెక్ట్ ఉంటుందని భావిస్తున్నా.. సోమవారం అర్ధరాత్రి తర్వాత.. తేలిపోయే అవకాశం కూడా ఉంటుందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. అయినప్పటికీ.. వందలాది గ్రామాల్లోని తీర ప్రాంత ప్రజలను కొంత దూరంగా ఉన్న షెల్టర్లలోకి తీసుకువచ్చారు. వీరికి సకల ఏర్పాట్లు చేశారు. ప్రతి ఒక్కరికీ దుప్పటి, ఉదయం ఆహారం, మధ్యాహ్న భోజనం,రాత్రి భోజనాలు, తాగునీరు, టీ, పాలు వంటివి కల్పించారు.
వీటితో పాటు.. పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న ఒక్కొక్క కుటుంబానికీ రూ.3 వేల చొప్పున నగదు ఇవ్వాలని.. కలెక్టర్లను సీఎం చంద్రబాబు ఆదేశించారు. అదేవిధంగా ఒక్కొక్క కుటుంబానికీ రేషన్ కింద.. 25 కేజీల బియ్యం, కిలో ఉల్లిపాయలు, ఆయిల్, గోధుమ పిండి, ఉల్లిపాయలు సహా.. ఇతర అవసరాలకు సబ్బులు, సర్ఫులు కూడా తగినన్ని ఇవ్వాలని సూచించారు. అదేసమయంలో వారిని త్వరపడి ఇళ్లకు పంపించేయొద్దని.. రెండు మూడు రోజులు అయినా.. పునరావాస కేంద్రాల్లో ఉండనివ్వాలని ఫ్యాన్లు ఏర్పాటు చేయాలనికూడా ఆదేశించారు.
ప్రస్తుతం కాకినాడ, బాపట్ల, నెల్లూరు, విజయనగరం, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిని మానిటరింగ్ చేసేందుకు ప్రత్యేక అధికారులను కూడా నియమించారు. ఎప్పటికప్పుడు ఆర్టీజీఎస్ ద్వారా సమాచారాన్ని అందించాలని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. ఎక్కడా ప్రాణ నష్టం సంభవించకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్త చర్యలు.. భవిష్యత్తులో తుఫాన్లను ఎదుర్కొనేందుకు ఒక రోల్ మోడల్ మాదిరిగా ఉపయోగపడాలని సూచించారు. ఈమేరకు కలెక్టర్లు.. జిల్లాల అధికారులు.. విపత్తు నిర్వహణ అధికారులు కూడా సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.