దర్శకుడు వేణు యెల్దండి ఎల్లమ్మని ఏ ముహూర్తంలో అనుకున్నాడో కానీ అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. ముందు నాని దగ్గరకు వెళ్ళింది. న్యాచురల్ స్టార్ కు విపరీతంగా నచ్చింది కానీ ప్యారడైజ్ తో పాటు రకరకాల కారణాల వల్ల తప్పుకున్నాడు. తర్వాత నితిన్ లైన్ లోకి వచ్చాడు. ఒకవేళ తమ్ముడు బ్లాక్ బస్టర్ అయ్యుంటే నిర్మాత దిల్ రాజు లెక్కలు ఎలా ఉండేవో కానీ క్యాలికులేషన్లు మారిపోయాయి. ఆపై ఇంకో ఇద్దరు తమిళ హీరోల పేర్లు వినిపించాయి. చివరికి ఎవరూ ఊహించని విధంగా దేవిశ్రీ ప్రసాద్ హీరోగా మారి తొలిసారి మేకప్ వేసుకునే ఛాన్స్ కొట్టేశాడు. ఇది కూడా ఇంకా అఫీషియల్ కాలేదు.
ఇప్పటిదాకా ఎల్లమ్మలో హీరోయిన్ గా వినిపించిన పేరు కీర్తి సురేష్. తాజాగా జరిగిన రివాల్వర్ రీటా ప్రెస్ మీట్ లో అందులో తాను లేనని చెప్పడం ఫ్యాన్స్ ను షాక్ కు గురి చేసింది. దేవి కొత్త హీరో అవుతాడు కాబట్టి తన పక్కన నటించడం వద్దనుకుందా లేక ఇతరత్రా కారణాలు ఏమైనా ఉన్నాయానేది ఇంకా తేలాల్సి ఉంది. దిల్ రాజు గత కొన్ని వారాలుగా మీడియాని కలిసే సందర్భం రాలేదు. అప్పుడెప్పుడో ఓజి ఈవెంట్ కోసం విమల్ థియేటర్ కు వచ్చాక కెమెరాకు అంత ఈజీగా దొరకడం లేదు. వేణు పరిస్థితి కూడా అంతే. ఇతర దర్శకుల్లా ఏదైనా ఈవెంట్ కు వస్తాడేమోనని చూస్తే ఆ ఛాన్స్ ఇవ్వడం లేదు.
చూస్తుంటే ఎల్లమ్మకు బాగానే టైం పట్టేలా ఉంది. దేవిశ్రీ ప్రసాద్ తో ప్రొసీడ్ అయినా సరే నిర్మాణానికి ఎక్కువ సమయం అవసరం కావొచ్చు. దిల్ రాజు బడ్జెట్ పరంగా రిస్కుని తగ్గించుకునేలా చూస్తున్నారట. అంటే వేణు ఇంతకు ముందు చెప్పిన బడ్జెట్ ని తగ్గించేలా ఉన్న మార్గాలను ట్రై చేస్తున్నారట. కొన్నేళ్ల క్రితం వివి వినాయక్ ని హీరోగా పరిచయం చేస్తూ శీనయ్య అనే సినిమా ప్రకటించారు దిల్ రాజు. తర్వాత అది రెగ్యులర్ షూట్ వెళ్లకుండానే క్యాన్సిల్ అయ్యింది. ఫస్ట్ లుక్ మాత్రం వదిలారు. ఇప్పుడు ఎల్లమ్మకు అలా జరగకపోతే చాలు. బలగం తర్వాత వేణు యెల్దండి ఎల్లమ్మ మీద పంచ ప్రాణాలు పెట్టుకున్నాడు.