hyderabadupdates.com movies కుంభతో సర్ప్రైజ్… మందాకినితో షాక్

కుంభతో సర్ప్రైజ్… మందాకినితో షాక్

దర్శకధీర రాజమౌళి ఈసారి ఏ మాత్రం ఊహకందని విధంగా ప్రమోషన్లు చేస్తున్నారు. అలాని ఏదో హడావిడి చేస్తున్నారని కాదు. చాలా సైలెంట్ గా ఫస్ట్ లుక్స్ వచ్చేస్తున్నాయి. చెప్పా పెట్టకుండా శృతి హాసన్ పాడిన పాటను రిలీజ్ చేశారు. పృథ్విరాజ్ సుకుమారన్ పోస్టర్ కి ఇలాగే చేశారు. ఇవాళ ప్రియాంకా చోప్రాని రివీల్ చేశారు. పసుపు పచ్చని చీరలో తుపాకీ పట్టుకుని బుల్లెట్లను పేలుస్తూ తన మీద శత్రువుల దాడిని ఎదురుకుంటూ వీరనారిగా కనిపించిన ఆమె పేరుని మందాకినీగా పరిచయం చేశారు. అంతుచిక్కని రీతిలో జక్కన్న ఇస్తున్న కంటెంట్ గురించి రకరకాల డీ కోడింగ్స్ జరుగుతున్నాయి. ఓసారి లింక్ చేసి చూద్దాం.

లీకైన సోర్స్ ప్రకారం ఎస్ఎస్ఎంబి 29లో మహేష్ బాబు పాత్ర పేరు రుద్ర. అంటే శివుడి పేరు. వారణాసి బ్యాక్ డ్రాప్ (టైటిల్ కూడా ఇదే అంటున్నారు), కాశిలో షూటింగ్, హీరో మెడలో లాకెట్ వగైరాలన్నీ నీలకంఠుడికి ముడి పెడుతున్నాయి. మందాకినీ అంటే శివుడి తలపై ఉండే గంగా మాతకు మరో పేరు. అంటే సింబాలిక్ గా మహేష్, ప్రియాంకాలు ఏమవుతారో చెప్పనక్కర్లేదు. కుంభ అంటే కుంభకర్ణుడు అనుకోవచ్చు. ఈశ్వరుడికి పరమభక్తుడైన రావణాసురుడికి స్వయానా సోదరుడు. ఇదంతా చూస్తుంటే సమ్ థింగ్ ఫిషి తరహాలో రచయిత విజయేంద్రప్రసాద్ ప్యాన్ వరల్డ్ సబ్జెక్టుని రాజమౌళికి ఇచ్చిన్నట్టు ఉన్నారు.

నవంబర్ 15 జరగబోయే ఈవెంట్ లో వీటిలో కొన్ని ప్రశ్నలకు సమాధానం దొరకబోతోంది. మహేష్ బాబు లుక్, సినిమా టైటిల్, మూడు నిమిషాల వీడియోలో రివీల్ చేయబోయే విజువల్స్ , రాజమౌళి స్పీచ్ తదితరాలన్నీ ఎంతో కొంత డీటెయిల్స్ ఇవ్వకుండా పోవు. మాములుగా తన కథలోని మెయిన్ పాయింట్ ని దాచకుండా ముందే చెప్పేయడం జక్కన్న ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న స్టైల్. ఈసారి కూడా అదే చేయొచ్చు. వేలాది అభిమానుల సమక్షంలో కళ్లుచెదిరే ఏర్పాట్ల మధ్య ఇంతకన్నా మంచి సందర్భం వేరే ఏం ఉంటుంది. చూడాలి రాబోయే మూడు రోజుల్లో ఇంకెన్ని ట్విస్టులు ఇవ్వబోతున్నారో.

Related Post