hyderabadupdates.com movies కూటమి ప్రభుత్వం పై రఘురామ అసంతృప్తి?

కూటమి ప్రభుత్వం పై రఘురామ అసంతృప్తి?

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును వైసీపీ ప్రభుత్వం కస్టోడియల్ టార్చర్‌కు గురి చేసిన వైనం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. 2019–24 మధ్య కాలంలో వైసీపీ రెబల్ ఎంపీ అయిన రఘురామను సీఐడీ అధికారులు రాజద్రోహం కేసు పెట్టి కస్టడీలో హింసించిన ఘటన షాకింగ్‌గా మారింది.

ఈ కస్టోడియల్ టార్చర్ కేసులో ప్రధాన నిందితుడైన ఏపీ సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌పై రఘురామ న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 16న ఆయనను దర్యాప్తు అధికారులు ఐదు గంటల పాటు విచారణ జరిపారు. అయినా సరే ఆయన నుంచి ఎటువంటి సమాధానాలు రాబట్టలేకపోయారు.

ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై రఘురామ కాస్త అసంతృప్తి వ్యక్తం చేశారు. నేడు మీడియాతో మాట్లాడిన రఘురామ వ్యాఖ్యలు చూస్తుంటే అదే స్పష్టంగా కనిపిస్తోంది. సునీల్ కుమార్‌పై దర్యాప్తు వేగవంతం చేసి కఠిన చర్యలు తీసుకోకుంటే తనకు వ్యక్తిగతంగా జరిగే నష్టమేమీ లేదని అన్నారు. కానీ ప్రభుత్వానికే నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. తాను ఏ తప్పు చేయలేదని, తనకు ఏ పార్టీ సహకారం అవసరం లేదని స్పష్టం చేశారు.

ఆధారాలు, సాక్షాలు చూపించినా… సంవత్సరంన్నర గడిచినా పీవీ సునీల్ కుమార్‌పై కేసు ముందుకు వెళ్లలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు ఎవరి సానుభూతి అవసరం లేదని చెప్పారు. వీలైనంత త్వరగా న్యాయం చేయాలని, అప్పుడే ప్రజలకు పాలనపై, పోలీసు వ్యవస్థపై నమ్మకం కలుగుతుందని అన్నారు. లేదంటే భవిష్యత్తులో ప్రభుత్వానికే ఇబ్బందులు వస్తాయని హెచ్చరించారు.

శిశుపాలుడు వంద తప్పులు చేస్తేగానీ శ్రీకృష్ణుడు సంహరించలేదని… అదే తరహాలో తమ ప్రభుత్వానికి పీవీ సునీల్ కుమార్‌ను శిక్షించే సాచురేషన్ పాయింట్ ఇంకా రాలేదేమోనని అసహనం వ్యక్తం చేశారు.

ఈ కేసులో తనకు సత్వర న్యాయం జరగకపోతే తన ఇమేజ్‌కు ఎలాంటి నష్టం లేదని, కానీ ప్రభుత్వానికే నష్టం ఉంటుందని చెప్పారు. తనకు గ్రాము నష్టం జరిగితే ప్రభుత్వానికి టన్నుల్లో నష్టం జరుగుతుందని వ్యాఖ్యానించారు. తాను ప్రభుత్వానికి దూరంగా, రాజ్యాంగబద్ధమైన డిప్యూటీ స్పీకర్ పదవిలో గౌరవంగా ఉన్నానని చెప్పారు. తాను ఎంత సంతోషంగా ఉన్నానో తన ముఖం చూస్తేనే తెలుస్తుందన్నారు.

మొత్తానికి పీవీ సునీల్ కుమార్‌పై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ఇంకా మీనమేషాలు లెక్కిస్తోందన్న భావనలో రఘురామ అసహనం వ్యక్తం చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

Related Post

Niharika NM on Mithra Mandali: It has got a fresh story and screenplay
Niharika NM on Mithra Mandali: It has got a fresh story and screenplay

Social media star Niharika NM is making her Tollywood debut with Mithra Mandali, which is set for Diwali release. Priyadarshi plays the protagonist. Kalyan Manthina, Bhanu Pratapa, and Dr. Vijender