ఏపీలో కూటమి ప్రభుత్వం 15 సంవత్సరాలు ఉంటుందని జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పదే పదే చెబుతున్నారు. ఇక, టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు కూడా ఇదే విషయాన్ని వల్లె వేస్తున్నారు. ఎక్కడ ఏ అవకాశం వచ్చినా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ విషయాన్ని చెబుతున్నారు. పార్టీ కార్యక్రమాల్లోనే కాదు, ప్రభుత్వం కార్యక్రమాల్లోనూ ఇదే మాట చెబుతున్నారు.
ఇక, చంద్రబాబు కూడా పార్టీ నాయకులకు ఈ విషయంపై నూరిపోస్తున్నారు. కలివిడి కావాలని, విడివిడి వద్దని చెబుతున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో వారు అనుకుంటున్న విధంగా పరిస్థితి కనిపించడం లేదు. మరి అలా కలివిడిగా ఉండాలంటే ఏం చేయాలి? కూటమి 15 ఏళ్ల కాపురానికి పాటించాల్సిన 10 సూత్రాలు ఏంటి అని విశ్లేషకులు చెబుతున్నారు. మరి అవి చూద్దామా..!
పార్టీ అధినేతలను కలుసుకునే అవకాశం నాయకులకు కల్పించాలి: తద్వారా తమ సమస్యలు చెప్పుకొనేందుకు నాయకులు ముందుకు వస్తారు. లేకపోతే స్థానికంగా ఉన్న నాయకులతో వివాదాలు కొనసాగుతూనే ఉంటాయి.
ఎమ్మెల్యేలతో తరచుగా భేటీ: ఎమ్మెల్యేలతో తరచుగా భేటీ కావడం ద్వారా టీడీపీ, జనసేనల మధ్య ఐక్యతను మరింత పెంచేందుకు అవకాశం ఉంటుంది.
ఉమ్మడి సమావేశాలు: గత ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన జనసేన-టీడీపీ ఎమ్మెల్యేలకు ఇప్పటి వరకు ఉమ్మడిగా ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదు. కేవలం అసెంబ్లీ సమావేశాలకే పరిమితం అయ్యారు. అలా కాకుండా ఉమ్మడి సమావేశాలను ప్రతి ఆరు నెలలకు నిర్వహించడం ద్వారా వారి మధ్య ఐక్యతకు బాటలు పరవచ్చు.
ఆరోపణలపై తక్షణ స్పందన: ఎక్కడ ఎవరిపై ఆరోపణలు వచ్చినా, పార్టీలకు అతీతంగా ప్రభుత్వం స్పందిస్తే, చాలా వరకు సమస్యలు దారిలోకి వస్తాయి.
అధికారులకు బాధ్యతలు: చాలా నియోజకవర్గాల్లో అధికారులు అచేతనంగా మారుతున్నారు. కేవలం ఎమ్మెల్యేలకు మాత్రమే ప్రాధాన్యం ఉంది. ఇలాంటి చోట కూటమి నాయకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిని పరిష్కరించాలి.
స్పష్టమైన వైఖరి: వచ్చేవి ఎన్నికల నాటికి కలివిడిగానే పోటీకి దిగుతామని చెబుతున్నా, దీనిపై అంతర్గత చర్చల్లో నాయకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. స్పష్టమైన వైఖరిని పంపాలి.
గ్రామీణ రాజకీయంపై పట్టు: ప్రస్తుతం గ్రామీణ రాజకీయాల్లో టీడీపీకి చాలా బలం ఉంది. అది చాలా సందర్భాల్లో కూటమి పార్టీలకు ఇబ్బందిగా మారింది. దీనిపై కూడా పార్టీల అధిష్ఠానాలు చర్చించి పట్టు పెంచుకునే దిశగా ఆలోచన చేయాలి.
సమన్వయం-సహకారం: జనసేన-టీడీపీ నేతలు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయం పెంచాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో సహకారం కూడా ముఖ్యమే.
నియోజకవర్గాల సమస్యలు: కూటమి నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ఆధిపత్య ధోరణులు పెరుగుతున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక యంత్రాంగాలను రెడీ చేయాల్సిన అవసరం ఉంది. తద్వారా సమస్యలను సానుకూలంగా పరిష్కరించే వెసులుబాటు ఉంటుంది.
క్షేత్రస్థాయి పర్యటనలు: క్షేత్రస్థాయిలో పార్టీ అధినేతలు పర్యటించడం అంటే, కేవలం కొద్దిమందికే ప్రాధాన్యం ఇస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. ఎక్కడ ఆరోపణ వస్తే, అక్కడికి వెళ్లేలా, దానిని పరిష్కరించే ప్రయత్నం చేసేలా వ్యవహరిస్తే, 15 ఏళ్లే కాదు మరిన్ని సంవత్సరాలు కూటమికి ఢోకా ఉండదు.