hyderabadupdates.com movies కొండా దంప‌తుల‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. చ‌ర్చ‌లు స‌మాప్తం!

కొండా దంప‌తుల‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. చ‌ర్చ‌లు స‌మాప్తం!

గ‌త కొన్నాళ్లుగా వివాదాల‌కు కేంద్రంగా మారిన వ్య‌వ‌హారాల‌పై తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు. ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ వ్య‌వ‌హారం మ‌రింత ముదిరిన నేప‌థ్యంలో దీపావ‌ళి వేళ ఆ కుటుంబంతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్కలు భేటీ అయ్యారు. స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. ముఖ్యంగా వ‌రంగ‌ల్ జిల్లాలో క‌డియం శ్రీహ‌రి వ‌ర్గానికి.. కొండా వ‌ర్గానికి మ‌ధ్య వివాదం ర‌గులుతున్న విష‌యం తెలిసిందే. దీనిపై స్థానికంగా ఉన్న నాయ‌కుల‌తో మాట్లాడి ప‌రిష్క‌రిస్తాన‌ని రేవంత్ హామీ ఇచ్చారు.

అదేవిధంగా ఇటీవ‌ల ఓఎస్‌డీ వ్య‌వ‌హారంలో పోలీసులు మ‌ఫ్టీలో వ‌చ్చి కొండా సురేఖ కుమార్తె సుష్మిత‌తో వాగ్వాదానికి దిగిన ఘ‌ట‌న‌పైనా మంత్రి సురేఖ ఫిర్యాదు చేశారు. త‌మ కుటుంబానికి ర‌క్ష‌ణ లేదా? అని ప్ర‌శ్నించిన‌ట్టు తెలిసింది. అయితే.. అలాఏమీ లేద‌ని.. ఏం జ‌రిగిందో.. డీజీపీని అడిగి వివ‌రాలు తెప్పించుకుంటాన‌ని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. అదేవిధంగామంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి  త‌న శాఖ విష‌యాల్లో జోక్యం చేసుకుంటున్న తీరును కూడా సురేఖ ప్ర‌శ్నించిన‌ట్టు తెలిసింది.

ఇది చిన్న విష‌య‌మ‌ని.. త‌న జిల్లాలో జ‌రుగుతున్న కార్య‌క్ర‌మం కావ‌డంతో జోక్యం చేసుకుని ఉంటార‌ని.. తాను ప‌రిష్క‌రిస్తాన‌ని డిప్యూటీ సీఎం భ‌ట్టి చెప్పుకొచ్చారు. ఇత‌ర స‌మ‌స్య‌ల‌ను సావ‌ధానంగా విన్న ముఖ్య మంత్రి.. కొన్ని కొన్ని సార్లు మ‌న ప్ర‌మేయం లేక‌పోయినా.. విమ‌ర్శ‌లు వ‌స్తాయ‌ని.. అలాంటి స‌మ‌యంలో కొంత సంయ‌మ‌నం పాటించాల‌ని మంత్రికి సూచించారు. అయితే.. తాము సంయ‌మ‌నంతోనే ఉన్నామ‌ని.. కానీ, త‌మ‌ను రెచ్చ‌గొడుతున్నార‌ని కొండా ముర‌ళి చెప్పిన‌ప్పుడు సీఎం రేవంత్‌.. “అదేం లేద‌న్నా..“ అంటూ స‌ముదాయించిన‌ట్టు తెలిసింది.

జూబ్లీహిల్స్‌లో గెల‌వాలి..

ఈ సంద‌ర్భంగా సీఎం రేవంత్ రెడ్డి.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విష‌యాన్నిసురేఖ కుటుంబానికి వివ‌రించారు. ఈ ఉప ఎన్నిక‌లో గెలవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని.. ఈ స‌మ‌యంలో ర‌చ్చ చేసుకుంటే మ‌న‌కు మంచిది కాద‌ని.. అంద‌రూ పార్టీలో స‌భ్యులేనని.. పార్టీ బ‌ల‌హీన ప‌డితే మ‌న‌కు కూడా గౌర‌వం కాద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. అంద‌రం క‌లిసి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌లో విజ‌యం ద‌క్కించుకునేందుకు కృషి చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. అనంత‌రం.. దీపావ‌ళి శుభాకాంక్ష‌ల‌తో అంద‌రూ చ‌ర్చ‌ను ముగించారు.

Related Post