మెగాస్టార్ చిరంజీవి ఫిల్మోగ్రఫీలో ‘కొదమ సింహం’ చాలా ప్రత్యేకం. తెలుగులో అరుదు అనదగ్గ కౌబాయ్ జానర్లో ఈ సినిమా తెరకెక్కింది. అంతకుముందు కృష్ణ మాత్రమే ఆ పాత్రలో అలరించారు. చిరు అంతకుమించిన స్వాగ్, స్టైల్‌తో కౌబాయ్ పాత్రను అద్భుతంగా పోషించాడు. కమర్షియల్‌గా మరీ పెద్ద సక్సెస్ సాధించకపోయినా.. మెగా అభిమానులకు ఇదొక అద్భుత జ్ఞాపకంగా మిగిలిపోయింది.
చిరు కూడా ఈ సినిమాను, పాత్రను చాలా స్పెషల్‌గా భావిస్తారు. ఇటీవలే ఈ సినిమా 4కేలో రీ రిలీజ్ అయింది. ఈ సందర్భంగా చిరు ఎంతో ఎగ్జైట్మెంట్‌తో ఈ సినిమా జ్ఞాపకాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలో ఆయన ‘కొదమసింహం’లో ఒక మూమెంట్ గురించి ఎన్నో ఏళ్లుగా జనాలకు ఉన్న సందేహాలకు తెరదించారు.
‘స్టార్ స్టార్ మెగా స్టార్ స్టార్’ అంటూ సాగే ఈ సినిమా ఇంట్రో సాంగ్‌లో చిరు ఒక చోట ఒక గదిలో రౌండ్ ద క్లాక్ నడుచుకుంటూ వెళ్తాడు. గోడ మీదికి ఎక్కుతున్నపుడు.. రివర్స్‌లో నడుస్తున్నపుడు కిందపడడం ఏమీ ఉండదు. నేరుగా నేల మీద నడిచినట్లే నడుస్తాడు. ఆ రోజుల్లో అది అందరినీ అబ్బురపరిచింది. అప్పుడున్న టెక్నాలజీతో దీన్ని ఎలా చిత్రీకరించారో అనే సందేహం చాలామందిలో ఉంది. దాని గురించి చిరు ఇప్పుడు ఓపెన్ అయ్యాడు.
ఒక బాక్స్ తరహాలో రూం సెట్ వేసి.. దాన్ని బయటి నుంచి తిప్పుతూ ఉంటే.. లోపల తాను నడుస్తుండగా కెమెరాతో షూట్ చేశారని.. బయటి ఎఫెక్ట్ ఎవరికీ కనబడదని.. తాను గోడల మీద ఏ సపోర్ట్ లేకుండా నడుస్తున్నట్లు అనిపిస్తుందని చిరు చెప్పాడు. కొన్నేళ్ల ముందు హాలీవుడ్ మూవీ ‘ఇన్సెప్షన్’లో ఇలాంటి సన్నివేశం ఒకటి చూశానని.. ఈ కాన్సెప్ట్‌ను అప్పట్లోనే తాము ‘కొదమసింహం’లో చూపించామని.. ఇది అందరినీ ఆశ్చర్యపరిచిందని చిరు చెప్పుకొచ్చాడు. ఐతే చిరు ‘కొదమసింహం’ రీ రిలీజ్ విషయంలో చాలా ఎగ్జైట్ అయ్యాడు కానీ.. ఈ చిత్రానికి బాక్సాఫీస్ దగ్గర ఆశించిన అయితే కనిపించలేదు.