అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలోని తీర ప్రాంతంలో కాలువలను సముద్రానికి అనుసంధానిస్తూ నిర్మించిన అవుట్ ఫాల్ స్లూయిజ్ లు పని చేయకపోవడం కారణంగా నాగాయలంక, కోడూరు మండలాల పరిధిలో సుమారు 5 వేల ఎకరాలు ముంపుకు గురవుతున్నాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల నేడు అవుట్ ఫాల్ స్లూయిజ్ లను పునరుద్ధరించేందుకు రూ.50 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు.
ఈరోజు ఉదయం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో కృష్ణా జిల్లా, అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పంట నష్టం అంచనాలు, నియోజకవర్గ అభివృద్ధి తదితర అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎదురుమొండి దీవుల్లో నివాసం ఉంటున్న 20 వేల మంది ప్రజల చిరకాల వాంఛ ఏటిమొగ – ఎదురుమొండి బ్రిడ్జి నిర్మాణానికి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తాం అన్నారు. కృష్ణా నదిపై నిర్మించతలపెట్టిన ఈ హైలెవల్ బ్రిడ్జ్ కోసం ఇప్పటికే రూ.109 కోట్ల నాబార్డు నిధులు మంజూరయ్యాయి. నిర్ణీత కాల వ్యవధిలో ఏటిమొగ – ఎదురుమొండి హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తాం అని తెలిపారు.
మొంథా తుపాను కారణంగా రాష్ట్రవ్యాప్తంగా తీర ప్రాంత గ్రామాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. గత వారం అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలో పర్యటించి దెబ్బతిన్న పంటలను పరిశీలించిన సమయంలో నష్టపోయిన వారిలో కౌలు రైతులు కూడా ఉన్న విషయం నా దృష్టికి వచ్చిందని పవన్పేర్కొన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పంట నష్టం అంచనాలు త్వరితగతిన పూర్తి చేయడంతోపాటు కౌలు రైతులకు కూడా న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి. ఒక్క కృష్ణా జిల్లాలోనే 60 వేల మందికి పైగా సీసీఆర్సీ కార్డులు కలిగిన కౌలు రైతులు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.
నమోదు చేసుకోని కౌలు రైతుల సంఖ్య కూడా ఉంటుంది. నష్టపోయిన ప్రతి కౌలు రైతుని గుర్తించి వారికి ఇబ్బందులు కలగకుండా యంత్రాంగం చర్యలు తీసుకోవాలన్నారు. కృష్ణా నది సముద్రంలో కలిసే హంసలదీవి పవిత్ర సాగర సంగమ ప్రాంతానికి ప్రజలు వెళ్లేందుకు అటవీ శాఖ కొంత రుసుము వసూలు చేస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. హిందువులంతా ఈ ప్రాంతాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. వసూలు చేస్తున్న రుసుము తక్కువే అయినప్పటికీ భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి అటవీశాఖ అధికారులు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలని ఆయన సూచించారు.