ఇప్పుడు పెద్ద పెద్ద హీరోల సినిమాల్లో కూడా వేరే స్టార్లు క్యామియోలు, ప్రత్యేక పాత్రలు చేయడం మామూలైపోయింది. వీలైనపుడు మల్టీస్టారర్లు కూడా చేస్తున్నారు స్టార్లు. మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాక పలు చిత్రాల్లో వేరే స్టార్లు ప్రత్యేక పాత్రలు పోషించారు. సైరాలో అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి నటిస్తే.. వాల్తేరు వీరయ్యలో రవితేజ సందడి చేశాడు. ప్రస్తుతం మన శంకర వర ప్రసాద్ చిత్రంలో విక్టరీ వెంకటేష్ స్పెషల్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇక చిరు నటించబోయే తర్వాతి సినిమాలోనూ ఒక స్టార్ హీరోతో ప్రత్యేక పాత్ర చేయించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ స్టార్ తెలుగు వాడు కాదు.. తెలుగువారికి బాగా చేరువైన తమిళ నటుడు కార్తి. వాల్తేరు వీరయ్య తర్వాత బాబీ దర్శకత్వంలో చిరు ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రంలో కార్తి ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. వాల్తేరు వీరయ్యలో రవితేజ తరహాలోనే ఇది కూడా కథలో కీలకమైన, సినిమాలో హైలైట్‌గా నిలిచే పాత్రేనట.
ప్రస్తుతం సౌత్ ఇండియాలో హ్యాపెనింగ్ బేనర్లలో ఒకటిగా మారుతున్న కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్లో ఈ సినిమాను రూపొందించనుంది. ఫుల్ యాక్షన్ టచ్ ఉన్న కథతో ఈ సినిమా ఉండబోతోంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించనుండగా.. మిరాయ్ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఛాయాగ్రహణం సమకూర్చనున్నాడు.
కార్తికి తెలుగులో మంచి ఫాలోయింగే ఉంది. అన్న సూర్యతో సమానంగా ఇక్కడ గుర్తింపు సంపాదించాడు. అతను ఇప్పటికే తెలుగులో ఊపిరి మూవీ చేశాడు. త్వరలో హిట్-4లోనూ నటించాల్సి ఉంది. ఈలోపే చిరు సినిమాలో ప్రత్యేక పాత్రకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ కాంబో ఎవ్వరూ ఊహించనిది. ఈ వార్త నిజమే అయితే ఈ సినిమాకు తమిళంలో కూడా మంచి మార్కెట్ క్రియేట్ అవుతుందనడంలో సందేహం లేదు.