శ్రీకాకుళంలోని కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట ఘటనలో 9 మంది దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో చాలామంది భక్తులు తీవ్రంగా గాయపడడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఘటనా స్థలానికి మంత్రి అచ్చెన్నాయుడు, టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష తదితరులు వెళ్లి సహాయక చర్యలను పరిశీలించారు. అదే క్రమంలో మాజీ మంత్రి, వైసీపీ నేత డాక్టర్ సీదిరి అప్పల రాజు కూడా హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.
స్వతహాగా డాక్టర్ అయిన అప్పలరాజు వెంటనే కొందరు క్షతగాత్రులకు సీపీఆర్ చేసి వారి ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేశారు. కొందరు క్షతగాత్రులకు సీపీఆర్ చేసి వెంటనే ఆక్సిజన్ అందించే ప్రయత్నం చేశారు అప్పల రాజు. అప్పలరాజుతో పాటు స్థానిక వైసీపీ నేతలు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైసీపీ సోషల్ మీడియా సర్కిల్స్ లో సర్క్యులేట్ అవుతోంది. సాధారణంగా ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం, అధికార పార్టీ నేతలు ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకుంటారు. సహాయక చర్యలను కూడా ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది.
అయితే, అందుకు భిన్నంగా అప్పల రాజు స్వయంగా రంగంలోకి దిగి సహాయక చర్యల్లో పాల్గొన్న వైనం చర్చనీయాంశమైంది. వైద్యో నారాయణో హరి అన్నదానికి న్యాయం చేసేలా అప్పలరాజు క్షతగాత్రులకు సీపీఆర్ చేసిన వైనం నిజంగా ప్రశంసనీయమని, డాక్టర్ సీదిరి అప్పలరాజు ఆన్ డ్యూటీ అంటూ కొందరు వైసీపీ అభిమానులు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.