hyderabadupdates.com movies గురు శిష్యుల మధ్య ‘కాంత’ చిచ్చు

గురు శిష్యుల మధ్య ‘కాంత’ చిచ్చు

మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ లాంటి స్ట్రెయిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ కాంత నవంబర్ 14 విడుదల కానుంది. పలు వాయిదాల తర్వాత ఎట్టకేలకో మంచి డేట్ పట్టేశారు. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ పీరియాడిక్ డ్రామాకు ఝాను చంతర్ సంగీతం సమకూర్చారు. ప్రోమోలతోనే ఆసక్తి రేపిన కాంత అసలు కంటెంట్ లో ఏముందో ఇవాళ ట్రైలర్ రూపంలో చెప్పే చెప్పే ప్రయత్నం చేశారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించిన కాంతకు దగ్గుబాటి రానా నిర్మాతల్లో ఒకరిగా వ్యవహరించడమే కాదు కీలక పాత్ర కూడా పోషించారు.

కథ దశాబ్దాల వెనుకటిది. పెద్ద స్టార్ కావాలనే సంకల్పంతో ఇండస్ట్రీకి వచ్చిన మహాదేవ్ (దుల్కర్ సల్మాన్) కు ఒక గురువు (సముతిరఖని) దొరుకుతాడు. ఆయన నీడ, మార్గదర్శకత్వంలోనే పెద్ద స్థాయికి చేరుకుంటాడు. అయితే ఈ ఇద్దరి కలయికలో మొదలైన శాంత అనే సినిమాను మహాదేవ్ తన చేతుల్లోకి తీసుకుని కాంతగా మార్చి గురువుని పక్కకు తప్పిస్తాడు. ఇది కాస్తా అంతర్యుద్ధంగా మారి ఏకంగా ఒక పోలీస్ (దగ్గుబాటి రానా) రంగప్రవేశం చేయాల్సి వస్తుంది. ఇదంతా ఎలా జరిగింది, తండ్రి కొడుకుల్లా మెలిగిన వాళ్ళ మధ్య చీలిక ఎందుకు వచ్చింది, మహాదేవ్ జీవితంలోని అమ్మాయి (భాగ్యశ్రీ బోర్సే) ఎవరనేది తెరమీద చూడాలి.

ఇది ఒకప్పుడు కోలీవుడ్ లో స్టార్ ఇమేజ్ అనుభవించిన ఒక సీనియర్ నటుడి బయోపిక్ అని చెన్నై వర్గాల సమాచారం. కొంచెం మహానటి షేడ్స్ కనిపిస్తున్నాయి. ఈగోలతో రగిలిపోయే హీరో, దర్శకుడు మధ్య జరిగిన యుద్ధాన్ని దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ చాలా ఆర్గానిక్ గా తెరకెక్కించినట్టు అనిపిస్తోంది. మణిరత్నం ఇద్దరు తరహా టేకింగ్ ని స్ఫూర్తిగా తీసుకున్నారు కాబోలు ఆ ఫ్లేవర్ వీడియోలో చాలా చోట్ల కనిపించింది. ఆర్టిస్టుల పోటాపోటీ నటనకు తోడు టెక్నికల్ గా సాలిడ్ గా కనిపిస్తున్న కాంత మీద అంచనాలు ఏర్పరచడంలో ట్రైలర్ సక్సెసయ్యింది. ఇక నవంబర్ 14 రావడమే తరువాయి.

Related Post