అమరావతి : ప్రభుత్వాలు, పార్టీలు మారినా పరిపాలనా పరమైన విధానాలు మాత్రం స్థిరంగా ఉండాలని స్పష్టం చేశారు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొణిదల. గత పాలకులు- రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడిదారులను బెదిరించి, కోర్టుకు ఈడ్చి నానా ఇబ్బందులు పెట్టారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం మాత్రం ప్రతి అడుగులో పెట్టుబడిదారుల్లో విశ్వాసం నింపుతోందన్నారు. ఇదంతా సీఎం చంద్రబాబు నాయుడు కృషి వల్లనే సాధ్యమైందన్నారు. తమ సర్కార్ వేధింపులకు పాల్పడదని, పెట్టుబడులతో వచ్చే వారికి ఎర్రతివాచీ పరుస్తుందని చెప్పారు పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో పెట్టుబడిదారులకు సానుకూల వాతావరణం కల్పిస్తున్నామన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ ని అగ్రగామిగా నిలిపే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నామని తెలిపారు.
అంతేకాకుండా పునరుత్పాదక ఇంధన రంగంలో రాష్ట్రాన్ని దేశంలో మొదటి స్థానంలో నిలపడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్. దేశ కాలుష్య రహిత ఇంధన ప్రయాణంలో గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు కీలక మైలురాయి అని అన్నారు. శనివారం కాకినాడలోని వాకలపూడిలో చంద్రబాబు నాయుడు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పి.వి.ఎన్. మాధవ్ తో కలసి ఏఎం గ్రీన్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రీన్ అమ్మోనియా-గ్రీన్ హైడ్రోజన్ కాంప్లెక్స్ కు శంకుస్థాపన చేశారు. గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ నిర్మాణాన్ని ప్రారంభించారు. ప్లాంట్ నమూనాని పరిశీలించి. యంత్ర పరికరాల పైలాన్ ను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు.
బలమైన సంకల్పం ఉంటే ఏదైనా సాధించగలం అని గ్రీన్ కో వ్యవస్థాపకులు చలమలశెట్టి అనిల్ నిరూపించారని అన్నారు . అనేక కష్టనష్టాలను తట్టుకుని ఈ రోజున ఏఎం గ్రీన్ కంపెనీ స్థాపించారని ప్రశంసించారు. కాకినాడలో 495 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు ఏర్పాటు కానుందని అన్నారు. ఏడాదికి 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు. రూ. 15, 600 కోట్లు పెట్టుబడితో ప్రారంభం అవుతున్న ఈ సంస్థలో 8 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పాదక ఇంధన పెట్టుబడులు రానున్నాయని చెప్పారు.
The post గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు గేమ్ ఛేంజర్ : పవన్ కళ్యాణ్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు గేమ్ ఛేంజర్ : పవన్ కళ్యాణ్
Categories: