వైసీపీ అధినేత జగన్‌ను అధికారంలోకి రాకుండా చేస్తానని.. అవసరమైతే.. చంద్రబాబు ఓకే అంటే.. తాను కూడా పాదయాత్రకు రెడీ అంటూ.. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే, 80 ఏళ్లకు పైబడిన వయసున్న సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి తాజాగా సంచలన ప్రకటన చేశారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. జగన్ పై నిప్పులు చెరిగారు.
జగన్‌కు హత్యారాజకీయాలు అలవాటేనని పేర్కొన్న గోరంట్ల.. ఓ మీడియా అధిపతికి జాగ్రత్తలు చెప్పారు. ఆయన ప్రజల కోసం పాటుపడుతున్నారని కొనియాడిన గోరంట్ల.. ఏ క్షణమైనా జగన్ నుంచి ప్రాణాలకు హాని ఉంటుందని తేల్చి చెప్పారు. గతంలో తన తండ్రి అధికారంలోకి వచ్చిన తర్వాత.. పరిటాల రవిని చంపించారంటూ.. జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు గోరంట్ల. అంతేకాదు.. బాబాయిని సైతం చంపించారని అన్నారు.
ఇలాంటి నేత .. మరోసారి అధికారంలోకి వస్తే.. రాష్ట్రానికి, దేశానికి కూడా అరిష్టమేనని.. రెండు కూడా ధ్వంస మవుతాయని గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఆయనను అడ్డుకునేందుకు తాను పార్టీ తరఫున శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. కూటమి కలివిడిగా ఉండాలనేది అందుకేనని.. కూటమి కలివిడి కోసం.. జగన్ అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు పాదయాత్ర చేయమన్నా చేస్తానని.. రాష్ట్రప్రజలకు జగన్ నిజ స్వరూపాన్ని వెల్లడిస్తానని చెప్పుకొచ్చారు.
తల్లిని చెల్లిని ఇంటి నుంచి గెంటేసిన జగన్.. ఇప్పుడు నీతులు చెబుతున్నారని ఆక్షేపించారు. ఆస్తుల కోసం.. రాజకీయం కోసం.. ఎంతకైనా తెగించే జగన్.. ఇప్పుడు కూడా అదే పంథాలో కొనసాగుతున్నాడని వ్యాఖ్యానించారు. ఇలాంటి వారు ఏపీలో ఉండడం రాష్ట్ర ప్రజలు చేసుకున్న దురదృష్టమని గోరంట్ల చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో కూటమి మరోసారి గెలవాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి అయితే.. దేశానికి , ప్రపంచానికి కూడా మేలు జరుగుతుందని అన్నారు.