hyderabadupdates.com movies జగన్ పాదయాత్రపైనే వైసీపీ గంపెడు ఆశలు

జగన్ పాదయాత్రపైనే వైసీపీ గంపెడు ఆశలు

వైసీపీ అధినేత జగన్ మరో పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. 2029 ఎన్నికలకు రెండేళ్ల ముందు.. అంటే 2027లో పాదయాత్ర చేపట్టబోతున్నట్లు ఈరోజు మాజీ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. ఈ పాదయాత్ర పైనే వైసీపీ నేతలు గంపెడు ఆశలు పెట్టుకున్నట్లు నేతల మాటలను బట్టి అర్థం అవుతుంది. ప్రజా సంకల్ప యాత్రకి నేటితో 8 ఏళ్ళు అయింది. 2017 నవంబర్ 6వ తేదిన ఇడుపులపాయ వైయస్ఆర్ ఘాట్ వద్ద నుంచి మొదలైన పాదయాత్ర.. జనవరి 9, 2019 ఇచ్ఛాపురం వద్ద ముగిసింది. 13 జిల్లాల్లో 134 అసెంబ్లీ నియోజకవర్గాలు, 231 మండలాలు, 2516 గ్రామాలను కలుపుతూ.. మొత్తం 3,648 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర సాగింది.

ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఏపీ వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు సంబరాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. మళ్లీ 2027లో ప్రజాసంకల్పయాత్ర పేరుతో పాదయాత్రను జగన్ చేపడతారని.. ఎన్నికల ముందు వరకు ఆ యాత్ర సాగుతుందని ఆయన వివరించారు.

ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన వైయస్ జగన్ దాదాపు ఏడాదిన్నర తర్వాత కూడా పూర్తిస్థాయిలో ప్రజల్లోకి రావడం లేదు. అప్పుడప్పుడు పరామర్శల పేరుతో ఆయన పర్యటనలు చేపడుతున్నా.. ఎక్కువ శాతం బెంగళూరులోనే ఉంటున్నారు. మొన్నటికి మొన్న ఏపీలో తుఫాను బీభత్సం సృష్టించినప్పుడు ఆయన అక్కడే ఉన్నారు. 11 రోజుల తర్వాత వచ్చి రైతులకు నకిలీ పరామర్శలు చేశాడంటూ టీడీపీ విమర్శలు గుప్పించింది. ఆయన పూర్తిగా జనాల్లోకి రాకపోవడం కార్యకర్తల్లోనూ కొంత అసంతృప్తి నెలకొంది.

మరోవైపు పార్టీలోని ముఖ్య నాయకులు కేసుల్లో చిక్కుకుని న్యాయస్థానాలు చుట్టూ తిరుగుతున్నారు. చాలామంది నేతలు పార్టీని వీడిపోయారు. మిగిలిన నాయకులు రాబోయే రోజుల్లో జగన్ చేపట్టబోయే పాదయాత్ర పైనే గంపెడు ఆశలు పెట్టుకున్నారు. జగన్ జనంలోకి వస్తే పార్టీలో ఎంతో కొంత ఉత్సాహం వస్తుందని భావిస్తున్నారు. కొద్ది రోజుల కిందట పార్టీ యూత్ నేతలతో సమావేశంలో జగన్ ఈ విషయంపై క్లారిటీ కూడా ఇచ్చారు. త్వరలో జిల్లాల పర్యటన చేపడుతానని, పాదయాత్ర కూడా చేస్తానని చెప్పారు.

అయితే దీనిపై ఇంకా కొంత స్పష్టత రావాల్సి ఉంది. ముందుగా జిల్లాల పర్యటన చేస్తారా.. ఒకేసారి పాదయాత్ర చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది. ఈరోజు మాజీ మంత్రి పేర్ని నాని ప్రకటించిన విధంగా వైఎస్ జగన్ 2027 లో పాదయాత్రకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటినుంచే దానికి సంబంధించిన కసరత్తు ప్రారంభిస్తున్నట్లు కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జగన్ మరో పాదయాత్ర వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయానికి ఎంత ప్రభావం చూపుతుందో అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది.

Related Post