hyderabadupdates.com movies జూబ్లీహిల్స్‌లోకి ష‌ర్మిల‌కు నో ఎంట్రీ.. రీజ‌నేంటి ..?

జూబ్లీహిల్స్‌లోకి ష‌ర్మిల‌కు నో ఎంట్రీ.. రీజ‌నేంటి ..?

హైదరాబాదులోని కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గం జూబ్లీహిల్స్. ఈ నియోజకవర్గానికి ఉపఎన్నిక వచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల 13 నుంచి నామినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. ముఖ్యంగా ఇక్కడ పాగా వేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తన బలాన్ని నిరూపించుకోవాలని ప్రజల్లో తమకు ఉన్న సానుకూలతను ప్రచారం చేసుకోవాలని పెద్ద ఎత్తున వ్యూహం రచించింది. దీంతో ఈ నియోజకవర్గంలో లెక్కకు మిక్కిలిగా నాయకులను దింపి ప్రచారం చేయాలని కూడా భావిస్తున్నారు.

ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలుగా ఉన్న వైఎస్ షర్మిల ప్రచారానికి ముందుకు వచ్చారు. ఈ విషయం పార్టీ అధిష్టానం దృష్టికి కూడా ఆమె తీసుకువెళ్లారు. ప్రస్తుతం స్టార్ క్యాంపైనర్ల జాబితాను కాంగ్రెస్ సిద్ధం చేస్తోంది. దీనిలో తన పేరును కూడా చేర్చాలని ఆమె పట్టుబట్టారు. ఈ విషయంపై ఈమెయిల్ ద్వారా పార్టీ అగ్ర నాయకులకు షర్మిల విన్నవించినట్టు తెలిసింది. అయితే, ఈ విషయంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు విముఖత వ్యక్తం చేసినట్టు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

ఆమె ప్రచారంతో పార్టీకి నష్టం వస్తుందని కూడా ఒకరిద్దరు నాయకులు తేల్చి చెప్పినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జూబ్లీహిల్స్ లో షర్మిల ప్రచారం చేస్తే తటస్థ ఓటు బ్యాంకు తమకు దూరమవుతుందని అదేవిధంగా తెలంగాణకు ఉన్న సంప్రదాయ ఓటు బ్యాంకు కూడా కాంగ్రెస్ పార్టీకి పడే అవకాశం లేదని పార్టీ నాయకులు చెప్పినట్లు తెలిసింది. వాస్తవానికి తెలంగాణతో తనకు అనుబంధముందని, తెలంగాణ తన మెట్టినిల్లుని ఒకప్పుడు షర్మిల ప్రచారం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే జూబ్లీహిల్స్ లో ప్రచారం చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ఆమె ఆలోచన.

అయితే, స్థానికంగా ఉన్న నాయకులు మాత్రం షర్మిల వస్తే ఉన్న ఓటు బ్యాంకు పోతుందని, ఇప్పుడు ఆమెపై అంత విశ్వసనీయత లేకుండా పోయిందని కూడా వారు చెబుతున్నారు. అంటే ఏపీలో జరుగుతున్న పరిణామాలను అంచనా వేసుకుని ఈ మాట చెబుతున్నారా.. లేకపోతే షర్మిలను ఏపీ నాయకురాలుగా మాత్రమే వారు గుర్తిస్తున్నారా.. అనేది తెలియాల్సి ఉంది. మొత్తంగా చూస్తే షర్మిల వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్ లో ఆసక్తికరంగా మారింది. ఆమె ప్రచారం చేసినందుకు వస్తానని చెప్పినా వద్దనడం నాయకుల మధ్య చర్చకు వస్తోంది.

షర్మిల జూబ్లీహిల్స్ లో ప్రచారం చేస్తే తెలంగాణకు సంప్రదాయంగా ఉన్న ఓటర్లు తమకు దూరమవుతారని అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీకి మరిన్ని ఆయుధాలు ఇచ్చినట్టు అవుతుందన్నది కూడా వారి ఆలోచనగా ఉన్నట్టు తెలుస్తోంది. తనను తాను తెలంగాణ కోడలుగా ప్రచారం చేసుకున్నప్పటికీ తెలంగాణ ప్రజలు మాత్రం ఆమెను రిసీవ్ చేసుకోలేదన్నది వాస్తవం. ఆమె సొంత పార్టీ పెట్టుకున్నప్ప‌టికీ పట్టుమని ఒక 100 మంది కూడా ఆమె పార్టీలో చేరేందుకు ముందుకు రాలేదు. పైగా ఆమెను వైఎస్ వారసురాలిగా కూడా గుర్తించడం లేదు.

ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు షర్మిలను పక్కన పెట్టాలన్న సూచన చేసినట్టు తెలుస్తోంది. అధిష్టానం దీనిపై ఇంకా పూర్తి నిర్ణయం తీసుకోన‌ప్పటికీ స్టార్ క్యాంపైనర్ల జాబితాలో మాత్రం షర్మిలను వద్దనే చెబుతున్నట్టు సమాచారం. మరి చివరకు ఏం జరుగుతుందనేది చూడాలి. మొత్తానికి షర్మిల ఆసక్తిని స్థానిక నాయకత్వమే వద్దని చెప్పడం విశేషం. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ గౌడ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.

Related Post