జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్‌కు సంబంధించిన ప్రచార పర్వం ముగిసింది. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ప్రకారం ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు ప్రచారానికి అవకాశం ఉండగా.. దాదాపు నియోజకవర్గంలో సాయంత్రం దీనికి పదినిమిషాల ముందే.. అభ్యర్థులు మైక్ ప్రచారాన్ని.. బహిరంగ సభలను కూడా ముగించారు. ఇక, ఇప్పటి నుంచి అభ్యర్థులు ఒకరిద్దరుగా ఇంటింటి ప్రచారం చేసుకునే అవకాశం ఉంది.
ఇక, అక్టోబరు 6న ఈ ఉపఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన దరిమిలా.. అదే నెల 13 నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇక, అక్టోబరు 10వ తేదీ నుంచి బీఆర్ ఎస్ పార్టీ ప్రచారం ప్రారంభించగా.. కాంగ్రెస్ పార్టీ అదే నెల 15వ తేదీ నుంచి ప్రచారాన్ని మొదలు పెట్టింది. అందరికన్న ఆలస్యంగా బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించడంతో ఈ పార్టీ చాలా ఆలస్యంగా ప్రచార పర్వంలోకి దిగింది. మొత్తంగా 22 రోజుల పాటు హోరా హోరీ ప్రచారం జరిగింది.
కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 8 సార్లు ప్రత్యక్షంగా ప్రచారంలో పాల్గొన్నారు. ఇక, బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్.. 32 సార్లు ప్రచారం చేశారు. ఇదేసమయంలో బీజేపీ తరఫున కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దాదాపు అన్ని రోజులు ప్రచారంలోనే ఉన్నారు. అత్యంత కీలకంగా భావిస్తున్న ఈ ఉప పోరులో ఈ నెల 11న పోలింగ్ జరగనుంది. ఫలితం ఇదే నెల 14న రానుంది.
అన్ని పాఠశాలలకు, ఆఫీసులకు ఈ నెల 11న సెలవు ప్రకటించారు. అయితే.. పోలింగ్ కేంద్రాలుగా ఎంపిక చేసిన పాఠశాలలకు 10వ తేదీ కూడా సెలవు ప్రకటించారు. మరోవైపు.. నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలకు.. కూడా సెలవు ప్రకటించారు.
భారీ భద్రత..
+ 1600 మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో ఉంటారు.+ 15 ఫ్లయింగ్ స్క్వాడ్స్ నిరంతరం బూత్‌లను పరిశీలించనున్నారు.+ 38 రూట్ మొబైల్స్, 8 స్ట్రైకింగ్ ఫోర్స్ కూడా పరిశీలిస్తాయి.+ 8 క్విక్ రియాక్షన్ టీమ్‌లను సిద్ధం చేశారు.+ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 65 సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.+ పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసుల ప్రత్యేక పికెటింగ్ ఏర్పాటు చేస్తారు.