జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ.. అభ్యర్థులకు కొత్త చిక్కు వచ్చింది. దీపావళి నేపథ్యంలో ప్రజలంతా పండగ హడావుడిలో ఉంటారని భావించిన పార్టీల అభ్యర్థులు కార్యాలయాలకు పరిమితం అయ్యారు. సమీపంలో ఉన్న అనుచరులు.. పార్టీ కీలక నాయకులను పిలిపించుకుని.. ఎన్నికలపై మంత్రాంగం నడుపుతున్నారు. బీఆర్ ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, బీజేపీ అభ్యర్థి లంకలపల్లి దీపక్ రెడ్డిలు తమ తమ కార్యాలయాలకే పరిమితం అయ్యారు.
అయితే.. వారు ఎన్నికల విషయంపైనా.. ఓటు బ్యాంకు.. ప్రచారం.. ప్రజలను ఎలా మచ్చిక చేసుకోవాలని అంతర్మథనం చెందుతున్న సమయంలో అనూహ్యంగా పార్టీ కార్యాలయాలకు ఫోన్లు వచ్చాయి. సరే.. అని అందరు నాయకులు ఫోన్లు రిసీవ్ చేసుకున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను చోటా లీడర్లు వివరించారు. ఈ సందర్భంగా వారు.. కీలక విషయాన్ని పంచుకున్నారు. నియోజకవర్గంలో ప్రజలు యువత పెద్ద ఎత్తున డివిజన్ కార్యాలయాలకు వస్తున్నారని తెలిపారు. దీంతో ఇంకేముంది.. నాయకులు ఉబ్బిత బ్బిబ్బయ్యారు.
తమకు అనుకూలంగా ప్రజలు వస్తున్నారని భావించారు. కానీ, అసలు విషయం తెలిసి ఆలోచనలో పడ్డారు. వచ్చిన వారంతా తమకు దీపావళి టపాసులు కావాలని కోరుతున్నట్టు డివిజన్ నాయకులు తెలిపారు. వాస్తవానికి ఎన్నికలకుముందు సొమ్ములు పంచడం కామనే. ఇప్పుడు అడిగి తీసుకుంటున్న పరిస్థితి కూడా మునుగోడు ఉప ఎన్నిక సమయంలో తెలంగాణలో కలకలం రేపింది. అలాంటిది ఇప్పుడు.. అనూహ్యంగా.. దీపావళికి టపాసులు కావాలని రావడంతో నాయకులు ఖంగు తిన్నారు.
కానీ, కీలకమైన ఎన్నిక, ఎవరు గెలుస్తారో ఇంకా ఒక అంచనాకు రాని సందర్భం. పైగా పెద్ద పండుగ. చేసే దేముంది.. తమ వారికి మళ్లీ ఫోన్లు చేసి..ప్యాకేజీలు మాట్లాడించారు. ఇంటికో ఫ్యామిలీ ప్యాక్ చొప్పున అందించేలా ఏర్పాట్లు చేశారు. అయితే.. కార్యాలయాలకు వచ్చిన వారికే ఇవ్వాలన్న సంకేతాలు ఇచ్చినట్టు తెలిసింది. దీనికి గాను పెద్దగా ఖర్చయ్యేది లేకపోయినా.. ఎన్నికల కమిషన్ అంటూ ఒకటి ఉండడం, నిఘా ముమ్మరం కావడంతో జాగ్రత్తగా పంపకాలు చేయాలని సూచించారట. సో.. ఇదీ.. సంగతి!!.