కెజిఎఫ్ తర్వాత విపరీతమైన గ్యాప్ తీసుకుని మరీ ఓకే చేసిన యష్ టాక్సిక్ డోలాయమానంలో పడిందని బెంగళూరు వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతోంది. వచ్చే ఏడాది మార్చి 19 విడుదల కావడం లేదని ఇప్పటికే ఒక వర్గం ధృవీకరిస్తుండగా అది పక్కాగా తెలిసే అడవి శేష్ డెకాయిట్ ఆ డేట్ ని తీసుకుందనే కామెంట్ కి మరింత బలం చేకూరుతోంది. దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఇప్పటిదాకా తీసిన ఫుటేజ్ ఆశించిన స్థాయిలో లేకపోవడం పట్ల యష్ అసంతృప్తి వ్యక్తం చేయడమే కాక కొంత కాలం షూటింగ్ ఆపేసి స్క్రిప్ట్ మీద మళ్ళీ వర్క్ చేద్దామని చెప్పాడట.
నిజానికి గీతూ మోహన్ దాస్ కి కమర్షియల్ సినిమాలు హ్యాండిల్ చేసిన అనుభవం లేదు. అయినా సరే యష్ ఆవిడను పూర్తిగా నమ్మాడు. అధికారికంగా ప్రాజెక్టు లాంచ్ చేయడానికి ముందు నెలల తరబడి డిస్కషన్లు చేసుకున్నారు. గోవా తదితర ప్రాంతాల్లో కఠినమైన శిక్షణ తీసుకున్నాడు యష్. భారీ పారితోషికాలు ఇచ్చి నయనతార, కియారా అద్వానీ లాంటి క్యాస్టింగ్ ని తీసుకున్నారు. ఇంత జరిగి కోట్లకు కోట్లు ఖర్చు పెట్టాక హఠాత్తుగా బ్రేక్ అంటే ఎవరికైనా షాక్ కలగక మానదు. నిజానికి టాక్సిక్ మీద విపరీతమైన హైప్ లేదు. ఆ మధ్య రిలీజ్ చేసిన చిన్న టీజర్ కు సైతం నెగటివ్ ఫీడ్ బ్యాక్ ఎక్కువ వచ్చింది.
టాక్సిక్ మాఫియా బ్యాక్ డ్రాప్ లోనే రూపొందుతోంది. మరి ఎక్కడ తేడా వచ్చిందో కానీ చూస్తుంటే 2026 రిలీజ్ కూడా అనుమానమే అంటున్నాయి ఇన్ సైడ్ టాక్స్. అయినా కెజిఎఫ్ తో ఎంత ప్యాన్ ఇండియా ఇమేజ్ వచ్చినా యష్ మరీ అతి జాగ్రత్తగా వెళ్లడం ఇక్కడి దాకా తీసుకొచ్చింది. తనతో సినిమాలు చేయాలని ఎందరో దర్శక నిర్మాతలు ట్రై చేశారు. అందరికీ నో చెప్పాడు. గీతూ మోహన్ దాస్ కు సైతం గ్రీన్ సిగ్నల్ వెంటనే రాలేదు. కెరీర్ మంచి పీక్స్ కు చేరుకుంటున్న టైంలో యష్ ఇంత నెమ్మదించడం పట్ల ఫ్యాన్స్ అయితే అసంతృప్తిగానే ఉన్నారు. మరి ఈ టాక్సిక్ గాసిప్స్ గురించి యష్, గీతూ ఏమంటారో చూడాలి.