వరస ఫ్లాపులతో సతమతమవుతున్న రామ్ ఇవాళ రిలాక్స్ అవ్వొచ్చు. చాలా గ్యాప్ తర్వాత తన సినిమాకు పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఎక్స్ ట్రాడినరి, అదుర్స్ బెదుర్స్ అని కాదు కానీ ఒకసారి చక్కగా చూడొచ్చనే మాట పబ్లిక్ లోనూ రివ్యూస్ లోనూ కనిపిస్తోంది. నిజానికి అడ్వాన్స్ బుకింగ్స్ ఆంధ్రకింగ్ తాలూకాకు నెమ్మదిగానే మొదలయ్యాయి. ప్రమోషన్లు విస్తృతంగా చేసినప్పటికీ ఇది రెగ్యులర్ మాస్ మూవీ కాకపోవడం, ఉపేంద్రతో టైటిల్ రోల్ చేయించడం లాంటి కారణాలు హైప్ మీద ప్రభావం చూపించాయి. ప్రధాన కారణం రామ్ గత డిజాస్టర్లు ఆడియన్స్ మొదటిరోజే రాకుండా స్పీడ్ బ్రేకర్స్ అయ్యాయి.
ఇప్పుడు ఆంధ్రకింగ్ తాలూకా మీద ఆ ఎఫెక్ట్ పడింది కానీ ఒక్కసారి డీసెంట్ టాక్ తెచ్చుకుంటే ఆటోమేటిక్ గా ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చేస్తారు. రామ్-భాగ్యశ్రీ బోర్సే కెమిస్ట్రీ, సంగీతం, ఉపేంద్ర పాత్ర ద్వారా చూపించిన ఇంటెన్సిటీ అన్ని వర్గాలకు కనెక్ట్ అవుతున్నాయి. ముఖ్యంగా రామ్ ఎనర్జీని దర్శకుడు మహేష్ బాబు బయటికి తీసిన తీరు ఫ్యాన్స్ కి భలే కిక్ ఇస్తోంది. ఒకరకంగా చెప్పాలంటే ఉపేంద్రని అండర్ మైన్ చేసిన రామ్ డామినేషన్ చాలా చోట్ల కనిపించింది. డాన్స్ పరంగా మరీ భీభత్సమైన స్టెప్పులు లేకపోయినా ఉన్నంతలో ఇంట్రో సాంగ్ లో ఒకప్పటి రామ్ జనాలకు కనిపించాడన్నది వాస్తవం.
ఇక ఈ టాక్ వాడుకోవడం రామ్ టీమ్ చేతుల్లో ఉంది. ప్రమోషన్లు కొనసాగించాలి. ఇదే పని మీద అమెరికాలో ఉన్న రామ్ ఇండియా తిరిగి రాగానే ముందు పబ్లిసిటీ మీద ఫోకస్ చేయాలి. బాక్సాఫీస్ వద్ద రాజు వెడ్స్ రాంబాయి తప్ప మరో హిట్ మూవీ లేదు. అది కూడా ఏపీ, సీడెడ్ లాంటి ప్రాంతాల్లో కొంచెం ఎదురీదుతోంది. అందుకే ఒక రోజు మహిళలకు ఫ్రీ టికెట్లు పెట్టారు. కానీ ఆంధ్రతాలూకా కింగ్ కు ఏ సమస్యా లేదు. డిసెంబర్ 5 అఖండ 2 తాండవం రాబోతున్న నేపథ్యంలో గురువారం రిలీజ్ తో మొత్తం ఎనిమిది రోజుల వీక్ అందుకున్న ఆంధ్రకింగ్ క్రమంగా కలెక్షన్లు పెంచుకుంటూ పోతే హిట్టు నుంచి బ్లాక్ బస్టర్ వైపు అడుగులు వేయొచ్చు.