బీహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత టిడిపిలో ఆసక్తికర చర్చ తెర మీదకు వచ్చింది. దేశంలో జమిలి ఎన్నికలకు అవకాశం ఉంటుందని.. నాయకులు భావిస్తున్నారు. ఇదే సమయంలో నియోజకవర్గాల పునర్విభజన కూడా సాకారం అవుతుందన్న ఆశలు, అంచనాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంపైనే టీడీపీ నాయకులు ఆసక్తిగా చర్చిస్తున్నారు. ప్రధానంగా గత ఎన్నికల్లో టికెట్లు దక్కని వారు, టికెట్లు త్యాగం చేసిన వారు ఇప్పుడు నియోజకవర్గ పునర్విభజనపైనే ఆశలు పెట్టుకున్నారు.
గత ఎన్నికల్లో టికెట్లు త్యాగం చేసిన వారి స్థానంలో గెలిచినవారు ఉన్నారు. అదేవిధంగా స్వల్ప స్థాయిలో ఓడినవారు కూడా ఉన్నారు. అయినప్పటికీ ఆయన నియోజకవర్గాల్లో పాత నేతలకు అవకాశం లేకుండా పోయిందన్నది కూడా వాస్తవం. టికెట్ త్యాగం చేసిన వారి విషయంలో అటు పార్టీ ఎలా ఉన్నప్పటికీ స్థానికంగా నాయకులు మాత్రం ఇబ్బందులు అయితే పడుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి తమకు మరో నియోజకవర్గమైన కేటాయించాలి.. అన్న డిమాండ్లు కూడా పెరుగుతున్నాయి.
ఉదాహరణకు మైలవరం నియోజకవర్గం కోల్పోయిన మాజీ మంత్రి దేవినేని ఉమా అదేవిధంగా పెదకూరపాడు నియోజకవర్గాన్ని కోల్పోయిన కొమ్మలపాటి శ్రీధర్ ఇలా చాలామంది నాయకులు తమకు వేరే నియోజకవర్గమైనా కేటాయించాలని చెబుతున్నారు. లేదా వచ్చే ఎన్నికల్లో ఆయా స్థానాల్లో అయినా తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. పార్టీ అంతర్గత సమావేశాల్లో ఈ విషయాన్ని ప్రధానంగా చెబుతూనే ఉన్నారు. కానీ ఇప్పటివరకు పార్టీ ఈ దిశగా ఆలోచన చేయట్లేదు.
ఎందుకంటే ఎన్నికలకు చాలా సమయం ఉంది. ఈ లోపు నియోజకవర్గాల పునర్విభజన అంశం తెర మీదకు వచ్చి అది గనక జరిగితే ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని పార్టీ భావిస్తోంది. అయితే కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంలో టిడిపి కూడా భాగస్వామి కావడంతో ఈ విషయాన్ని సాధ్యమైనంత వేగంగా పరిష్కరించేందుకు చంద్రబాబు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని పలువురు నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడు ప్రక్రియ మొదలుపెడితే కనీసం సంవత్సరం అయినా సమయం పడుతుందని నాయకులు చెబుతున్నారు.
విభజన జరిగితే కొత్త నియోజకవర్గాలు ఏర్పడతాయి సుమారు 50 నియోజకవర్గాలు అందుబాటులోకి వస్తాయి. తద్వారా గతంలో టికెట్లు త్యాగం చేసిన వారు కొత్తగా ఇప్పుడు కోరుకునే వారికి కూడా అవకాశం దక్కుతుంది అన్న విషయం స్పష్టం. అయితే ఈ దిశగా ఏ మేరకు అడుగులు పడుతున్నాయి అన్నదే అసలు చర్చ. కాగా, బీహార్ ఎన్నికల అనంతరం నియోజకవర్గాల పునర్విభజనపై దృష్టి పెడతామని కేంద్రం గతంలో హామీ ఇచ్చింది. దీంతో ఇప్పుడు ఈ విషయంపై టీడీపీ నాయకులు ఆసక్తిగా చర్చిస్తున్నారు. మరి ఎప్పుడు మొదలుపెడతారు ఏంటి అనేది చూడాలి.