సీఎం చంద్రబాబు మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలతో మరోసారి టెలీకాన్ఫరెన్సు నిర్వహించారు. ప్రస్తుతం ఢిల్లీ పర్య టనలో ఉన్న చంద్రబాబు.. ఈ పర్యటనలో దొరికిన ఓ గంట గ్యాప్‌ను కూడా వదులు కోకుండా.. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు.. అభివృద్ధిపై స్పందించారు. సహజంగా నిరంతరం బిజీగా ఉండే సీఎం చంద్రబాబు ఓ గంట గ్యాప్ లభిస్తే.. రెస్టు తీసుకోవచ్చు. ఎవరూ ఏమీ అడగరు. పైగానిత్యం ఆయన ప్రజలతోనే ఉంటున్నారు. అయినా.. కూడా చంద్రబాబు అలాంటి ఆలోచన చేయలేదు.
ఢిల్లీ పర్యటనలో దొరికిన గంట గ్యాప్‌ను కూడా ఆయన పార్టీ నాయకులతో మాట్లాడేందుకు వినియోగించుకున్నారు. వారు ఏం చేస్తున్నారో తెలుసుకున్నారు. జూమ్ ద్వారా నాయకులతో మాట్లాడిన చంద్రబాబు.. ప్రస్తుతం విద్యుత్ చార్జీల తగ్గింపు విషయంలో వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనాలని వారికి సూచించారు. అదేసమయంలో సమర్థ పాలనకు, వైసీపీ అసమర్థ పాలనకు ఉన్న తేడాను కూడా ప్రజలకు వివరించాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని.. ప్రజలకు వివరించడమే కాకుండా.. ఆధారాలను కూడా చూపించాలన్నారు.
వైసీపీ హయాంలో విద్యుత్ చార్జీలను ఎలా పెంచారో.. ఆధారాలతో పాటు పాత బిల్లులను కూడా చూపించి వివరిం చాలని చంద్రబాబు తెలిపారు. అప్పట్లో ట్రూ అప్ పేరుతో ప్రజల నుంచి ఎలా వసూలు చేశారో.. అందరికీ చెప్పాలన్నారు. కానీ, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత.. ట్రూ డౌన్‌పేరుతో తగ్గించామని.. దీనివల్ల ప్రజలకు విద్యుత్ చార్జీల భారం తగ్గుతుందని.. ఈ విషయాన్ని వారికి సమగ్రంగా వివరించాలని తెలిపారు. కేవలం మాటలు చెప్పి సరిపెట్టడం కాకుండా.. ప్రజలకు అసలు అప్పట్లో ఏం జరిగింది? ఇప్పుడు ఏం జరుగుతోందో కూడా వివరించాలన్నారు. మొత్తానికి చంద్రబాబు తనకు లభించిన గంట గ్యాప్‌ను కూడా వదిలి పెట్టకుండా.. పనిచేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.