“ఆయనే నా బాస్. పార్టీలో నేను ఆయన కింద పనిచేస్తాను.“ అంటూ.. ప్రధాని నరేంద్ర మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బీహార్‌కు చెందిన నితన్ నబీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధికారికంగా బీజేపీ ఈ ప్రకటన చేసింది. అనంతరం.. నితిన్.. ఢిల్లీలోని ప్రధాని నివాసానికి వెళ్లి.. ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ నితిన్‌ను అభినందించారు.
ఈ సందర్భంగా ప్రధాని స్పందిస్తూ.. తన బాస్.. నితిన్ నబీనేనని వ్యాఖ్యానించారు. దీంతో బీజేపీ అగ్రనాయకులు.. చప్పట్లతో అభినందనలు తెలిపారు. తాను సాధారణ బీజేపీ కార్యకర్తనేనని.. ఇక నుంచి నితిన్ ఆధ్వర్యంలోనే తాను రాజకీయంగా అడుగులు వేస్తానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక, బీజేపీ గురించి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పై పరోక్షంగా చురకలు అంటించారు.
బీజేపీ విధానాలు ప్రజాస్వామ్య యుతంగా ఉంటాయని.. ఎక్కడా ఎవరి పెత్తనమూ ఉండదని వ్యాఖ్యానించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ ఎంపిక.. ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిలువుటద్దమని మోడీ అన్నారు. ఒక చిన్న, సాధారణ స్థాయి కార్యకర్త కూడా.. పార్టీ జాతీయ అధ్యక్షుడు కావడం.. బీజేపీకే సొంతమని తెలిపారు. ఇది మరో పార్టీలో మనకు కనిపించదన్నారు. కులాలు.. మతాలకు అతీతంగా.. రాజకీయ వారసత్వానికి కూడా వ్యతిరేకంగా ఈ ఎంపిక జరిగిందన్నారు.
కాగా.. 45 ఏళ్ల నితిన్.. ప్రస్తుతం బీహార్ మంత్రిగా ఉన్నారు. మూడు సార్లు వరుసగా అసెంబ్లీకి ఎన్నికయ్యా రు. అంతేకాదు.. బీహార్ నుంచి తొలిసారి.. బీజేపీ పగ్గాలు చేపట్టిన నాయకుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు.
పిన్నవయసులోనే పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మరో రికార్డు ను కూడా సొంతం చేసుకున్నారు. అయితే.. ఈయన కూడా వారసత్వంగానే రాజకీయాల్లోకి రావడం గమనార్హం. ఆయన తండ్రి మాజీ ఎమ్మెల్యే. ఆయన మరణానంతరం.. నితిన్ రాజకీయాల్లోకి వచ్చారు.