ఇవాళ అఖండ 2 ఫుల్ ఆడియో జ్యుక్ బాక్స్ విడుదలయ్యింది. సినిమా రిలీజ్ కు సరిగ్గా మూడు రోజుల ముందు అన్ని పాటలు వదిలేయడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే నిన్నటిదాకా వచ్చిన రెండు లిరికల్ సాంగ్స్ కు భారీ రెస్పాన్స్ రాలేదు. జాజికాయ సాంగ్ రెగ్యులర్ స్టైల్ లో సాగగా, అఖండ తాండవం అంటూ సాగే బ్యాక్ గ్రౌండ్ పాట కూడా ఆశించినంత రీచ్ తెచ్చుకోలేదు. విచిత్రం ఏంటంటే ఇవాళ వదిలిన ఫుల్ ఆల్బమ్ లో మిగిలిన పాటలు ట్రాన్స్ లోకి వెళ్లేంత బాగున్నాయి. అన్నీ డివోషనల్ టచ్ ఉన్నవి కావడంతో పాటు మొత్తం ట్రాక్స్ కలిపి 32 నిముషాలు ఉండటం అసలు ట్విస్ట్.
బాలయ్య కెరీర్ లో ఇన్ని సంఖ్యలో భక్తి పాటలు ఉన్న సినిమా ఇదొక్కటే అని చెప్పాలి. శ్రీ కృష్ణార్జున విజయం లాంటివి ఉన్నాయి కానీ ఇతిహాసాల నేపథ్యంలో రూపొందాయి కాబట్టి వాటిని కౌంట్ లోకి తీసుకోలేం. తమన్ పనితనమంతా అఖండ 2లో నిజంగా బయట పడేలా ఉంది. కాకపోతే బోయపాటి శీను లాంటి ఊర మాస్ కమర్షియల్ దర్శకుడు మూడు గంటల సినిమాలో వీటిని ఎలా ప్లేస్ చేసి ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. అసలే యాక్షన్లు, ఎలివేషన్లు ఓ రేంజ్ లో పడ్డాయి. చూస్తుంటే వాటికే బీజీఎమ్ గా ఈ పాటలను వాడి ఉంటారు కాబోలు. అయితే ఇక్కడో పొరపాటుని ఒప్పుకోక తప్పదు.
ఇదే ఆల్బమ్ ని ఏ నెలరోజుల క్రితమే విడుదల చేసి ఉంటే మరింత బజ్ పెరిగేందుకు ఉపయోగపడేది. ఎంత స్టార్ హీరో సినిమా అయినా సరే ప్రమోషన్లు చాలా ముఖ్యంగా. పెద్దికి ఆరు నెలల ముందు చికిరి చికిరి రిలీజ్ చేయడం వల్ల ఏకంగా బిజినెస్ పెరగడానికి ఉపయోగపడుతోంది. సంగీతంకున్న పవర్ ఇది. తన మీద వచ్చిన విమర్శలకు కౌంటర్ ఇస్తూ తమన్ మొన్న ఓసారి ఇన్స్ టాలో ఎంతమంది వస్తారో రండ్రా అంటూ మెసేజ్ పెట్టడం వైరల్ అయ్యింది. బహుశా అఖండ 2 ఆల్బమ్ దృష్టిలో పెట్టుకునే అన్నాడేమో. ఇక అసలైన ఛాలెంజ్ డిసెంబర్ 5 థియేటర్లలో బీజీఎమ్ తో మెప్పించేది ఉంటుంది.