రాజకీయ విశ్లేషకులు ఊహించిందే జరిగింది. తమిళనాడులో పర్యటించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. ఖచ్చితంగా ఎన్నికల వ్యూహాన్ని ఆవిష్కరిస్తారని విశ్లేషకులు అంచనా వేశారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడులో ఆయన పర్యటన పెట్టుకోవడం కూడా కీలక వ్యూహమేనని చెప్పారు. దీనిని నిజం చేసినట్టుగా ప్రధాని నరేంద్ర మోడీ.. ఇటీవల బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే సాధించిన ఘన విజయాన్ని ప్రస్తావించారు. అంతేకాదు.. ఎన్నికలకు చాలా ముందే.. తమిళనాడు లో బీహార్ గాలి(బీహార్ హవా) వీస్తోందని వ్యాఖ్యానించారు.
పీఎం-కిసాన్ యోజన కింద దేశవ్యాప్తంగా 9 కోట్ల మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం రూ.2000 చొప్పున ఆర్థిక సాయం చేసింది. దీనికి సంబంధించి తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో నిర్వహించిన కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు రైతుల నుంచి ఘన స్వాగతం లభించింది. వారి మెడలోని కండువాలనుతీసి.. గాలిలో తిప్పుతూ.. ప్రధానికి స్వాగతం పలికారు.(ఇది ముందుగానే నేర్పించారని అధికారపార్టీ డీఎంకే విమర్శించింది.) అనంతరం.. ప్రధాని పీఎం-కిసాన్ నిధులను విడుదల చేశారు. అదేవిధంగా ఓ సదస్సును కూడా ఆయన ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. తమిళనాడులోనూ బీహార్ గాలి వీస్తోందని.. నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. తను రావడానికి ముందుగానే బీహార్ గాలి.. తమిళనాడును చుట్టేసిందని చమత్కరించారు. ఇక్కడి రైతులు చాలా తెలివైన వారని వ్యాఖ్యానించారు. ఇక్కడి జైళి పరిశ్రమ ద్వారా దేశానికి ఎంతో ఆదాయం చేకూరుతోందన్నారు. ఇదేసమయంలో కోయంబత్తూరు వాసి.. సీపీ రాధాకృష్ణన్ ని ఉపరాష్ట్రపతి పదవికి ఎంపిక చేసి.. ఈ ప్రాంతానికి, ఈ నేలకు మరింత గౌరవం తీసుకువచ్చామని.. ప్రధాని చెప్పుకొచ్చారు.(దీనిని కూడా విశ్లేషకులు ముందుగానే అంచనా వేశారు.) గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు.. వ్యవసాయాన్ని మించిన రంగం లేదన్నారు.
కాగా.. బీహార్‌లో ఎన్డీయే కూటమి ఇటీవల ఘన విజయం దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ సహా పలు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలను బీజేపీ కీలకంగా భావిస్తోంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడులో పాగా వేసేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే గత మూడేళ్లుగా నిర్వహిస్తున్న కాశీ తమిళ సంగం, రాధాకృష్ణన్‌ను ఉప రాష్ట్రపతిని చేయడం వంటి విషయాలతో పాటు అభివృద్ధికి కూడా ప్రాధాన్యం ఇస్తుండడం గమనార్హం. ఈ క్రమంలోనే ప్రధాని పర్యటన సాగిందన్నది విశ్లేషకుల మాట.