hyderabadupdates.com movies తాట తీస్తా… ప్రైవేటు కాలేజీలకు సీఎం వార్నింగ్

తాట తీస్తా… ప్రైవేటు కాలేజీలకు సీఎం వార్నింగ్

ఫీజు రీయింబర్స్‎మెంట్ బకాయిలు ప్రభుత్వం చెల్లించడం లేదని ఆరోపిస్తూ ప్రైవేట్ కాలేజీల యాజమాన్యం బంద్ న‎కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ప్రభుత్వం బకాయిలు 3 వేల కోట్లు మాత్రమే అని చెబుతుంటే..కాలేజీల యాజమాన్యాలు ఆరు వేల కోట్లు డిమాండ్ చేస్తున్నాయని టాక్ వస్తోంది. ఈ క్రమంలోనే ఆ కాలేజీల యాజమాన్యాలపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. విద్యార్థుల జీవితాలతో ఆటలాడితే ఉపేక్షించబోమని డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు.

తమాషాలు చేస్తే తాట తీస్తామని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలను రేవంత్  హెచ్చరించారు. కాలేజీలు మూసేస్తామంటే చూస్తూ ఊరుకోబోమని, విద్యను వ్యాపారం చేస్తామంటే కుదరదని తేల్చి చెప్పారు. గత ప్రభుత్వం బకాయి పెట్టిన డబ్బులను ఈ ప్రభుత్వం ఉన్నపళంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తే ఎలా ఇస్తామని ప్రశ్నించారు. విడతల వారీగా ఫీజు రీయింబర్స్‎మెంట్ నిధులు విడుదల చేస్తామని అన్నారు. రూ.3 వేల కోట్ల బకాయిలుంటే, రూ.6 వేల కోట్లు ఇవ్వమంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పిల్లల భవిష్యత్తుతో ఆటలాడొద్దని, విద్యార్థుల పట్ల ఓవరాక్షన్ చేస్తే సహించబోమని వార్నింగ్ ఇచ్చారు. విద్యార్థులను ఇబ్బంది పెడితే ఏం చేయాలో తమకు తెలుసని అన్నారు. కాలేజీల్లో విద్యా ప్రమాణాలు పరిశీలించేందుకు అధికారులు వెళ్లడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. కాలేజీ యాజమాన్యాలు అడిగినవి ఇవ్వనందుకే ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

విద్య అంటే వ్యాపారం కాదని.. విద్య అంటే సేవ అని, ఒక్కో కాలేజీ విచ్ఛలవిడిగా ఫీజులు పెంచుకుంటూ పోయాయని మండిపడ్డారు. కాలేజీల ఫీజులు చూసి తానే షాకయ్యానని, నిబంధనల ప్రకారం కాలేజీలు నడపకుండా ఫీజులు మాత్రం ఎక్కువ కావాలని డిమాండ్ చేస్తారని అసహనం వ్యక్తం చేశారు. ఫీజ్ రీయింబర్స్‎మెంట్‎పై విద్యార్థులను రెచ్చగొడుతున్నదెవరో, ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ఏ రాజకీయ పార్టీతో అంటకాగుతున్నాయో తమకు తెలుసని అన్నారు.

Related Post