కెనడాలో తన కేఫ్‌పై జరిగిన వరుస కాల్పుల గురించి స్టార్ కమెడియన్ కపిల్ శర్మ తొలిసారి నోరు విప్పాడు. అక్కడ మూడుసార్లు అటాక్స్ జరిగినా, తనకేం భయం లేదన్నట్లుగా మాట్లాడాడు. తన కొత్త సినిమా ‘కిస్ కిస్కో ప్యార్ కరూన్ 2’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఈ విషయంపై స్పందిస్తూ, కెనడా పోలీసుల తీరుపై పరోక్షంగా సెటైర్లు వేశాడు. బహుశా అక్కడి రూల్స్ వల్ల పోలీసులకు ఇలాంటి ఘటనలను కంట్రోల్ చేసే పవర్ లేదేమో అనిపిస్తోందని అన్నాడు.
ఇదే సమయంలో ముంబై పోలీసులపై మాత్రం కపిల్ ప్రశంసల వర్షం కురిపించాడు. “నాకు మన దేశంలో, ముఖ్యంగా ముంబైలో ఉన్నంత సేఫ్ ఫీలింగ్ ఎక్కడా కలగలేదు. ముంబై పోలీసుల పనితీరు ఎంత షార్ప్‌గా ఉంటుందో మనందరికీ తెలుసు. వేరే ఏ సిటీ కూడా ముంబైకి సాటి రాదు” అని తేల్చి చెప్పాడు. విదేశాల్లో రక్షణ లేకపోయినా, మన దగ్గర మాత్రం ఫుల్ సెక్యూరిటీ ఉందని గర్వంగా చెప్పుకున్నాడు.
ఇక్కడే కపిల్ శర్మ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాడు. సాధారణంగా తుపాకీ కాల్పులు జరిగితే జనాలు భయపడి షాపుకు రారు. కానీ తన కేఫ్ విషయంలో సీన్ రివర్స్ అయ్యిందట. “ప్రతిసారి కాల్పులు జరిగిన తర్వాత, మా కేఫ్‌కి ఇంకా ఎక్కువమంది వచ్చారు. బిజినెస్ ఇంకా పెరిగింది. దేవుడు మనతో ఉంటే అంతా మంచే జరుగుతుంది” అని నవ్వుతూ చెప్పాడు. జూలై, ఆగస్టు, అక్టోబర్‌లలో మూడుసార్లు అటాక్స్ జరిగినా, సర్రేలోని తన ‘కప్స్ కేఫ్’ క్రేజ్ మాత్రం తగ్గలేదట.
అయితే, తన కేఫ్‌పై జరిగిన దాడులు కెనడా ప్రభుత్వంలో కదలిక వచ్చినట్లు కపిల్ తెలిపాడు. ఈ విషయం అక్కడి ఫెడరల్ గవర్నమెంట్ దాకా వెళ్లిందని, పార్లమెంట్‌లో కూడా చర్చ జరిగిందని చెప్పాడు. తన ఇన్సిడెంట్ తర్వాతే అక్కడ లా అండ్ ఆర్డర్ గురించి సీరియస్‌గా ఆలోచించడం మొదలుపెట్టారని, ఇప్పుడు కొత్త చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించాడు. చాలామంది తనకు ఫోన్ చేసి, ఈ విషయం న్యూస్ అవ్వడం వల్లే అక్కడ మార్పు వస్తోందని చెప్పారట.