ఇటీవల ఆసియా కప్ టీ20 టోర్నీమెంట్లో భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్‌ల సందర్భంగా జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. తొలి మ్యాచ్‌లో పాక్ ఆటగాళ్లతో భారత క్రికెటర్లు షేక్ హ్యాండ్ చేయకపోవడంతో మొదలైన గొడవ.. ఫైనల్లో గెలిచిన భారత జట్టు ట్రోఫీ లేకుండా ఇంటికి రావడం వరకు కొనసాగింది. టోర్నీలో పాక్‌తో తలపడ్డ మూడుసార్లూ విజయం సాధించిన భారత్.. ఆ జట్టుకు ఘోర అవమానాన్ని మిగిల్చింది. ఐతే పాకిస్థాన్ మంత్రి కూడా అయిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు మోసిన నఖ్వి చేతుల నుంచి ట్రోఫీ తీసుకోవడానికి భారత జట్టు ససేమిరా అనగా.. ట్రోఫీని మరొకరి చేతుల మీదుగా ఇప్పించాల్సిన నఖ్వి, పంతం పట్టి ట్రోఫీ ఇవ్వకుండా తన వెంట తీసుకుపోవడం తీవ్ర వివాదాస్పదం అయింద.
దీంతో భారత జట్టు ట్రోఫీ లేకుండానే విజయోత్సవ సంబరాలు చేసుకుంది. వట్టి చేతులతో స్వదేశానికి వచ్చేసింది. కానీ ఈ విషయాన్ని బీసీసీఐ అంత తేలిగ్గా వదిలేస్తుందా? ప్రపంచ క్రికెట్లో భారత బోర్డు సత్తా ఏంటో నఖ్వి సహా అందరికీ తెలుసు. ఆ బలంతో ఇప్పడు నఖ్విని దారికి తీసుకొచ్చింది బీసీసీఐ.
ట్రోఫీ కావాలంటే తన ఆఫీసుకు వచ్చి కలెక్ట్ చేసుకోవాలంటూ బిల్డప్ ఇచ్చిన నఖ్వి.. ఇప్పుడు బీసీసీఐ దెబ్బకు తోక ముడిచినట్లు తెలిసిందే. అతను ఆసియా కప్‌ను ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుకు అప్పగించాడు. వాళ్లు ట్రోఫీతో పాటు భారత క్రికెటర్లకు అందాల్సిన విన్నింగ్ మెడల్స్‌ను కూడా ఇండియాకు పంపిస్తున్నారు. ఇండియా ఈ విషయాన్ని ఇంతటితో వదిలేలా కూడా కనిపించడం లేదు. నఖ్వితో సారీ చెప్పించాలని చూస్తోంది.
అంతే కాక ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్ష పదవి నుంచి నఖ్విని తప్పించడానికి కూడా రంగం సిద్ధం చేస్తోంది. ఈ కౌన్సిల్‌లో భాగమైన మిగతా దేశాలతో ఈ మేరకు ఒత్తిడి తెప్పిస్తోంది. అంతే కాక ఐసీసీకి కూడా నఖ్వి మీద ఫిర్యాదు చేసింది. ఐసీసీ ఛైర్మన్ పదవిలో ఉన్నది భారతీయుడైన జై షానే అన్న సంగతి తెలిసిందే. కాబట్టి త్వరలో నఖ్వి ఈ పదవి నుంచి వైదలగితే ఆశ్చర్యమేమీ లేదు. పాకిస్థాన్ అంతర్గత మంత్రి అయిన నఖ్వి.. ఆపరేషన్ సిందూర్ టైంలో ఇండియాకు వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. అలాంటి వ్యక్తి చేతి నుంచి ఆసియా కప్‌ను అందుకోవడానికి టీమ్ ఇండియా అంగీకరించలేదు.