hyderabadupdates.com movies థియేటర్లో హిట్టు కొట్టాక ఆది తగ్గుతాడా

థియేటర్లో హిట్టు కొట్టాక ఆది తగ్గుతాడా

‘శంబాల’కు ముందు ఆది సాయికుమార్ ఎప్పుడు హిట్టు కొట్టాడో కూడా ప్రేక్షకులకు గుర్తు లేదు. కెరీర్ ఆరంభంలో ప్రేమకావాలి, లవ్లీ సినిమాలతో ఆకట్టుకున్న అతడికి.. ఆ తర్వాత థియేట్రికల్ సక్సెస్ లేదు. కానీ అతడికి ఏ దశలోనూ అవకాశాలకు మాత్రం లోటు లేదు. వరుసగా సినిమాలు చేసుకుంటూ పోయాడు. అవేవీ థియేటర్లలో ఆడకపోయినా.. ఓటీటీలో మాత్రం భారీగా వ్యూస్ తెచ్చుకునేవి.

ఒక దశలో ఆది సినిమాలు థియేటర్లలో రిలీజ్ కావడమే గగనమైంది. నేరుగా కొన్ని చిత్రాలు ఓటీటీలోకే వెళ్లాయి. వాటికి కూడా వ్యూస్ బాగానే వచ్చేవి. థియేట్రికల్ మార్కెట్ జీరో అయినా సరే.. తన డిజిటల్ మార్కెట్‌కు మాత్రం ఢోకా లేకపోయింది. అక్కడ అలాంటి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడతను. తన సినిమాల డిజిటల్ హక్కులు మంచి రేటుకు అమ్ముడవుతూ వచ్చాయి. అంతగా అతడికి అక్కడ మార్కెట్ స్థిరపడింది.

ఐతే ఫ్లాప్ సినిమాలతోనే అంతగా వ్యూస్ తెచ్చుకునే హీరో.. థియేటర్లలో హిట్ కొడితే ఇక మామూలుగా ఉంటుందా? తన కొత్త చిత్రం ‘శంబాల’ క్రిస్మస్ కానుకగా విడుదలై సూపర్ హిట్టయిన సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి రూ.20 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. ఈ చిత్రం ఇటీవలే ఓటీటీలో రిలీజైంది. దీనికి ఆరంభం నుంచి భారీగా వ్యూస్ వస్తున్నాయి. ఆల్రెడీ ఈ చిత్రం 50 మిలియన్ వ్యూస్ మార్కును అందుకుంది. 

డిజిటల్‌గా రిలీజైన ఐదో రోజుకే 5 కోట్ల వ్యూస్ అంటే చిన్న విషయం కాదు. స్టార్ల సినిమాలకు మాత్రమే ఇలాంటి వ్యూయర్‌షిప్ వస్తుంటుంది.

జనం మాత్రం ఈ సినిమాను ఓటీటీలో బాగా చూస్తున్నారన్నది స్పష్టం. ‘శంబాల’ ఆది కెరీర్‌కు మంచి ఊపునిచ్చిన నేపథ్యంలో తన తర్వాతి సినిమాలకు మంచి బిజినెస్ జరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి.

Related Post