ఇటీవల లండన్ పర్యటనకు వెళ్లేముందు.. సీఎం చంద్రబాబు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ నాయకులకు కొన్ని దిశానిర్దేశాలు చేశారు. ఇదేసమయంలో ప్రజల నుంచి వినతులు కూడా తీసుకున్నారు. వీటిలో ఎక్కువగా రెవెన్యూ పరమైన సమస్యలు.. ముఖ్యంగా రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరుగుతున్న అవకతవకలపైనే ఉన్నాయి. వీటిని సావధానంగా విన్న చంద్రబాబు ఎవరినీ హెచ్చరించలేదు. ఎవరినీ ఏమీ అనలేదు.
కానీ, దాని తాలూకు పర్యవసానం మాత్రం ఆ వెంటనే కనిపించింది. హుటాహుటిన ప్రక్షాళనకు దిగారు. ఏసీబీని రంగంలోకి దింపారు. రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. ఒకే రోజు పలు కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. కోట్ల రూపాయల సొమ్ములు స్వాధీనం చేసుకున్నారు. పలువురు అధికారులపైనా కేసులు నమోదు చేశారు. ఇదేసమయంలో అవకతవకలతో పాటు అనధికార వ్యక్తులు చక్రం తిప్పుతున్న తీరును కూడా తెలుసుకున్నారు.
ఈ మొత్తం వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ యంత్రాంగంలో గుబులు పుట్టించింది. వాస్తవానికి గతంలో చంద్రబాబు ముందు హెచ్చరించేవారు. పనితీరు మార్చుకోవాలని.. ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పే వారు. కానీ ఈ దఫా అలాంటి హెచ్చరికలు ఏమీ లేకుండానే నేరుగా రంగంలోకి దిగిపోయారు. ఈ క్రమంలో 2 కీలక విషయాలను ఆయన పరోక్షంగా చెప్పేశారు. 1) ప్రజాసేవలో అక్రమాలకు తావు ఉండదు: ఈ విషయంలో చంద్రబాబు ఆది నుంచి చెప్పిన విషయాన్నే ఇప్పుడు అమలు చేశారు.
అందుకే ఇంత హఠాత్తుగా నిర్ణయం తీసుకున్నారు. 2) ఎంతటి వారినైనా వదిలేది లేదు: ఈ విషయాన్ని కూడా సీఎం చంద్రబాబు తరచుగా చెబుతున్నారు. అయితే.. అధికారులు ఈ విషయంలో రాజకీయ నాయకులను చంద్రబాబు హెచ్చరిస్తున్నారని భావించి ఉంటారు. కానీ, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలపై చంద్రబాబు.. ఎప్పటికప్పుడు.. పరిశీలన చేస్తున్నారు. తాజాగా వెయ్యికి పైగా ఫిర్యాదులు ఒక్క రిజిస్ట్రార్ కార్యాలయాలపైనే రావడంతో చెప్పకుండానే చర్యలు తీసుకున్నారు. దీనికి ప్రజల నుంచి హర్షం వ్యక్తం కావడం గమనార్హం.