hyderabadupdates.com movies దారుణంగా మోసపోయిన మోహన్ లాల్ ఫ్యాన్స్‌

దారుణంగా మోసపోయిన మోహన్ లాల్ ఫ్యాన్స్‌

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్‌ ఫ్యాన్ ఫాలోయింగ్ కేవలం కేరళకు పరిమితం కాదు. తమిళం, తెలుగులోనూ ఆయనకు భారీగానే అభిమాన గణం ఉంది. ఓటీటీల పుణ్యమా అని ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా విస్తరించింది. క్వాలిటీ కంటెంట్ ఉన్న సినిమాలే చేస్తాడనే పేరుండడం వల్ల ఆయన ప్రతి చిత్రానికీ కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోతుంటారు ఫ్యాన్స్. 

ఈ ఏడాది ఎల్-2 ఎంపురాన్, తుడరుం లాంటి రికార్డ్ బ్రేకింగ్ హిట్లు ఇచ్చిన లాలెట్టన్.. ‘హృదయపూర్వం’తోనూ సక్సెస్ అందుకున్నారు. ఇక ఏడాది చివర్లో ‘వృషభ’ అనే సినిమాతో బాక్సాఫీస్ పోటీకి రెడీ అయ్యారు. పోస్టర్లు, ప్రోమోలు చూసి ఇదేదో ‘మరక్కార్’ లాంటి భారీ ప్రయత్నంలా ఉందని.. రాజు పాత్రలో మోహన్ లాల్ విశ్వరూపం చూద్దామనుకుని థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులకు దిమ్మదిరిగి బొమ్మ కనిపించింది. ఈ సినిమాలో అసలు మోహన్ లాల్ హీరోనే కాకపోవడం వారికి పెద్ద షాక్.

సమర్జిత్ లంకేష్ అనే బాగా డబ్బున్న కుర్రాడిని హీరోగా లాంచ్ చేయడం కోసం చేసిన సినిమా ‘వృషభ’. ఇందులో మోహన్ లాల్‌ది సెకండ్ లీడ్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు. సినిమాలో ఎక్కువ సన్నివేశాలున్నది, ఎక్కువ ఎలివేషన్లు పడింది లంకేష్‌కే. మోహన్ లాల్ పాత్ర గురించి.. మొత్తంగా సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.

డబ్బులు ఎక్కువైపోయో లేదా భారీ నష్టాలు చూపించి ఇన్‌కమ్ ట్యాక్సులు తగ్గించుకోవడానికో ఈ సినిమా తీశారా అనిపించేలా.. పేలవమైన కథాకథనాలతో ఒక హారిబుల్ సినిమా తీసి పెట్టారు. 

‘వృషభ’ మేకర్స్ మోహన్ లాల్ ఫేస్ ముందు పెట్టి జనాలను థియేటర్లకు రప్పించారు. తీరా చూస్తే ఆయనది దాదాపుగా సైడ్ క్యారెక్టరే. మామూలుగా మోహన్ లాల్ ఫ్లాప్ సినిమాల్లో కూడా ఆయన పెర్ఫామెన్స్ బాగుంటుంది. కానీ ‘వృషభ’లో ఆయన క్యారెక్టర్, పెర్ఫామెన్స్ పేలవంగా అనిపిస్తాయి.

సినిమా అంతా ఆయన క్లూ లెస్‌గా కనిపిస్తారు. మోహన్ లాల్ అసలీ సినిమాను ఎలా ఒప్పుకున్నారా అనే ఆశ్చర్యం కలుగుతుంది. భారీ పారితోషకం ఇచ్చి ఆయన్ని ఒప్పించారేమో. సినిమా రిజల్ట్ ఏంటో ముందే తెలుసో ఏమో.. రిలీజ్ ముంగిట ఆయన ‘వృషభ’ను పెద్దగా ప్రమోట్ చేయలేదు. కానీ మోహన్ లాల్ ఉన్నాడు కదా అని సినిమాకు వెళ్లి బలైపోయిన ప్రేక్షకులు మాత్రం.. ఇది లాలెట్టన్ సినిమా అంటూ మోసం చేశారంటూ మేకర్స్ మీద మండిపడుతున్నారు.

Related Post