ఎక్కడైనా భారీ వేదికలపై పెళ్లి జరగడం తెలుసు. లేదా.. గుడిలో పెళ్లిళ్లు జరగడం కూడా తెలిసిందే. లేదా.. ఇళ్ల వద్దే భారీ ఖర్చులతో లేదా సింపుల్గా అయినా.. పెళ్లిళ్లు చేసుకున్న ఘటనలు మనకు తెలిసిందే. అయితే.. దేశంలో తొలిసారి ఐసీయూలో పెళ్లి జరిగింది. ఇటీవల దేశంలో ఐసీయూలో ఉన్న పేషంట్లపై అత్యాచారాలు, అఘాయిత్యాలు జరిగిన ఘటనలు కలకలం రేపగా.. తాజాగా ఐసీయూలో సంప్రదాయంగా పెద్దలు కుదిర్చిన పెళ్లి జరగడం దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది. అయితే.. ఇదేదో ప్రత్యేకత కోసమో రీల్స్ కోసమో చేసుకున్నది కాదు. విధివశాత్తు జరిగిన పెళ్లి!.
విషయం ఏంటంటే..
కేరళలోని అళప్పురం, తంబోలి ప్రాంతాలకు చెందిన వీఎం శరణ్, అవనిలకు.. ఇరు కుటుంబాలు పెళ్లి చేయాలని నిర్ణయించాయి. ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లే. ఇరువురు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు. దీంతో అంగరంగ వైభవంగా ఫైవ్ స్టార్ వేడుకలతో వివాహాన్ని జరిపించాలని భావించారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తవుతున్నాయి. పెద్ద ఎత్తున వివాహ పత్రికలు, అతిథులకు కానుకలు, వారికి షడ్రుచులతో కూడిన భోజనాలకు ఆర్డర్లు కూడా అయిపోయాయి. ఇక, మరో మూడు రోజుల్లో వివాహం జరగనుందనగా.. అనుకోని ఘటన జరిగింది. అది కూడా.. వివాహ క్రతువు నిమిత్తం..మూడు రోజుల ముందు పెళ్లికూతురు అవనిని అలరించి.. స్థానిక దేవాలయంలో పూజలకు తీసుకువెళ్లే సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది.
అవనితోపాటు బంధువులు.. ఓ కారులో కుమారకోమ్కు వెళ్తుండగా.. రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి.. చెట్టును బలంగా ఢీ కొట్టింది. దీంతో కారులో ఉన్నవారు తీవ్రంగా గాయపడ్డారు. పెళ్లి కుమార్తె అవనికి వెన్నుపూస దెబ్బతింది. దీంతో బాధితులంతా ఆసుపత్రి పాలయ్యారు. మరో మూడురోజుల్లో పెళ్లి జరగాల్సి ఉందనగా ఈ ఘటన జరగడంతో సహజంగానే పెళ్లికి బ్రేక్ పడుతుంది. మరో ముహూర్తం చూసుకుని పెళ్లికి రెడీ అయ్యే ప్రయత్నం చేస్తారు.. కానీ.. ఇక్కడే అనుకోని మలుపు చోటు చేసుకుంది.
ఏదేమైనా.. ముందుగా నిర్ణయించిన ముహూర్తానికే పెళ్లి చేయాలని పెళ్లి కుమారుడు శరణ్ పట్టుబట్టాడు. కానీ, మరోవైపు అవని తీవ్ర గాయంతో ఐసీయూలో చేరింది. అయినా అక్కడే పెళ్లి చేయాలని తన వారిని కోరడంతో శరణ్ తల్లిదండ్రులు రంగంలోకి దిగి.. అవని బంధువులతో చర్చించారు. దీనికి వారు కూడా ఓకే చెప్పడంతో.. ఆసుపత్రి వర్గాలను కలిసి.. వారిని కూడా ఒప్పించారు. దీంతో ఎమర్జెన్సీ గదిలోనే తాళి కట్టి అవనిని శరణ్పెళ్లి చేసుకున్నాడు. అయితే.. ఆ గదిలో కేవలం ఐదుగురికి మాత్రమే వైద్యులు అనుమతించారు. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఘనంగా చేసుకుందామని.. వందలామంది బంధువులు, స్నేహితుల మధ్య తాళి కట్టాలని భావించినా.. `విధి` ఐసీయూకు పరిమితం చేసిందని.. కొందరు వ్యాఖ్యానించారు.