hyderabadupdates.com movies ధనుష్‌కు మాత్రం ఎలా సాధ్యం?

ధనుష్‌కు మాత్రం ఎలా సాధ్యం?

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్ వచ్చిందంటే చాలు.. ఆ హీరో ఏడాదికి ఒక సినిమా చేయడం కూడా గగనం అయిపోతోంది. ఒక్క సినిమా కోసం కొన్నేళ్లు ఖర్చు పెట్టేస్తున్నారు. ఇకపై వేగంగా సినిమాలు చేస్తాం అంటారే కానీ.. ఆ ఆలోచన కార్యరూపం దాల్చడం కష్టమే. మలయాళంలో మాత్రం మోహన్ లాల్, మమ్ముట్టి లాంటి టాప్ స్టార్లు ఏడాది రెండు మూడు సినిమాలకు తక్కువ కాకుండా లాగించేస్తుంటారు. వాళ్ల వర్కింగ్ స్టైల్ ముందు నుంచి అలాగే ఉంటోంది. ఇప్పటికీ అదే కొనసాగుతోంది. 

కానీ టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్‌లో మాత్రం అందుకు భిన్నం. ముఖ్యంగా తెలుగు, తమిళ సినీ పరిశ్రమలకు విషయానికి వస్తే చాలా పోలికలు కనిపిస్తాయి. స్టార్లందరూ నెమ్మదిగా సినిమాలు చేసేవాళ్లే. ఏడాదికి ఒక రిలీజ్ ఉండడం కష్టమే. కానీ తమిళంలో పెద్ద స్టార్లలో ఒకడైన ధనుష్ మాత్రం ఇంకెవరికీ సాధ్యం కాని స్పీడుతో దూసుకెళ్తున్నాడు. హీరోగా రాణిస్తూనే దర్శకుడిగా, నిర్మాతగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తూ అతను గ్యాప్ లేకుండా సినిమాలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

పోయినేడాది అతను మూడు చిత్రాలతో ప్రేక్షకులను పలకరించాడు. ఏడాది ఆరంభంలో ధనుష్ దర్శకుడిగా, నిర్మాతగా ‘నిలవుకు ఎన్మేల్ ఎన్నడీ కోబం’ అనే సినిమా తీశాడు. ధనుష్ మేనల్లుడు హీరోగా నటించిన చిత్రమిది. ఇది ఓ మాదిరి ఫలితాన్నే అందుకుంది.

ఏడాది మధ్యలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ నటించిన ‘కుబేర’ రిలీజైంది. అది తెలుగులో సూపర్ హిట్ అయింది. తమిళంలో ఒక మాదిరిగా ఆడింది. ఇక ఏడాది చివర్లో ‘ఇడ్లీ కడై’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ధనుష్. ఈ చిత్రానికి అతను దర్శకుడు కూడా. ఇది తమిళంలో మాత్రమే హిట్టయింది. ఇలా ఏడాదిలో మూడు సక్సెస్ ఫుల్ చిత్రాలు అందించాడు. హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా విజయాలందుకున్నాడు. 

తర్వాత అతనేమీ రిలాక్స్ అయిపోలేదు. ‘పోర్ తొళిల్’ దర్శకుడు విఘ్నేష్ రాజాతో చకచకా ‘కర’ అనే సినిమా లాగించేశాడు. ప్రామిసింగ్‌గా కనిపిస్తున్న ఆ చిత్రం.. ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరోవైపు బ్లాక్‌బస్టర్ మూవీ ‘అమరన్’ దర్శకుడితో ధనుష్ చేస్తున్న సినిమా చిత్రీకరణ మధ్యలో ఉంది.

ఇంకోవైపు ‘లబ్బర్ పందు’ డైరెక్టర్‌తో ఒక సినిమా ఓకే చేశాడు. అలాగే స్వీయ దర్శకత్వంలో మృణాల్ ఠాకూర్ కథానాయికగా ఒక సినిమా తీస్తాడని వార్తలు వస్తున్నాయి. దాంతో పాటు నిర్మాతగా ఒక సినిమాను లైన్లో పెట్టాడు. ఒక స్టార్ హీరో ఇన్ని బాధ్యతల్లో ఇంత బిజీగా ఉంటూ గ్యాప్ లేకుండా సినిమాలు తీయడం అనూహ్యం. ఇంకెవరికీ సాధ్యం కానిది ధనుష్ వల్ల మాత్రమే అవుతోందంటే అది అతడి ప్రతిభ, కష్టం, పట్టుదల వల్లే అనడంలో సందేహం లేదు.

Related Post

“Dhandoraa” Teaser Creates Buzz: Cast Confident About December 25 Release“Dhandoraa” Teaser Creates Buzz: Cast Confident About December 25 Release

The teaser of “Dhandoraa” has created a strong buzz, with the entire team expressing huge confidence in the film at the teaser launch event. Produced by Ravindra Benarji Muppaneni under